విజయదశమి.. సామాజిక చైతన్యపు బాట!
వై.శాంతికుమార్ :
‘మహిషాసుర మర్దన అంటే బయటి రాక్షసులను చంపడం మాత్రమే కాదు.. మనలోని అహంకారాన్ని, సమాజంలోని లింగ, కుల వివక్షలను(Gender and caste discrimination) తుదముట్టించడమే! స్త్రీకి గౌరవం(Respect for Women), శ్రమజీవికి సమన్యాయం లభించినప్పుడే నిజమైన విజయదశమి(Vijayadashami)!’ భారతీయ సమాజంలో పండుగలు కేవ లం కాలానుగుణంగా వచ్చే ఉత్సవాలు మాత్రమే కావు. అవి ప్రజల జీవన విధానంతో, విశ్వాసాలతో, ఆధ్యాత్మిక శోభతో ముడిపడి ఉన్న సాంస్కృతిక వారసత్వాలు.
శరదృతువు ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆశ్వయుజ మాసంలో(Ashvayuja Month) వచ్చే శరన్నవరాత్రులు దేవీ ఆరాధనకు, సృజనాత్మకతకు నిలయం. తొమ్మిది రోజులపా టు జగన్మాతను పూజించి, పదో రోజున జరుపుకొనే విజయదశమి పండుగకు ఆధ్యాత్మిక ప్రాధాన్యంతోపాటు ఎంతో ప్రాముఖ్యమైన సామాజిక సందేశం కూడా ఉంది. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం, అజ్ఞానంపై జ్ఞానం సాధించే శాశ్వత విజయానికి ఈ పండుగ మహోన్నత ప్రతీక.
యుగాల నాటి విజయాలతో..
విజయదశమి వెనుక ఎన్నో పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి. దేవీ భాగవతం ప్రకారం.. లోకాలను కల్లోలపరచిన మహిషాసురుడితో దుర్గాదేవి తొమ్మిది రాత్రులు హోరాహోరీగా పోరాడి, ఆశ్వయుజ శుక్ల దశమి నాడు ఆ రాక్షసుడిని సంహరించి ‘మహిషాసురమర్దిని’గా అమితమైన విజయాన్ని సాధించింది. మరోవై పు రామాయణంలో, లంకేశ్వరుడైన రావణుడిపై యుద్ధానికి వెళ్లే ముందు శ్రీరా ముడు అపరాజితాదేవిని పూజించి, విజయదశమి నాడే రావణ వధను పూర్తిచే శాడని ప్రతీతి.
అలాగే మహాభారతంలో, పాండవులు తమ ద్వాదశ వర్ష అరణ్యవాసము, ఒక సంవత్సర అజ్ఞాతవాసాన్ని ముగించుకొని, శమీ వృక్షంపై దాచిన తమ దివ్యాస్త్రాలను తిరిగి చేతికి తీసుకున్న పవిత్ర దినమిది. ఉత్తర గోగ్రహణ యుద్ధం లో అర్జునుడు శమీ పూజ చేసి కౌరవ సేనను ఓడించి విజయం సాధించాడు. అందుకే ఏ ముహూర్తమూ చూడకుండానే కొత్త పనులు, కొత్త విద్యలు ప్రారం భించడానికి ఈ ‘విజయ ముహూర్తం’ ఎంతో అనుకూలమని శతాబ్దాలుగా ప్రజ లు విశ్వసిస్తారు.
శమీ.. బంగారం!
సాయంత్రం వేళ జమ్మి చెట్టును పూజించి ‘శమీ శమయతే పాపం..’ అని స్మరిస్తూ జమ్మి ఆకులను బంగారంగా భావించి ఆత్మీయులకు పంచి ఆశీస్సులు తీసుకోవడం, శుభానికి సూచికగా ‘పాలపిట్ట’ను దర్శించడం మన సంస్కృతిలో భాగమయ్యాయి.
కామక్రోధాలు రాక్షసత్వాలే!
మహిషాసురుడు అంటే కేవలం పురాణాల్లో కనిపించే రాక్షసుడు మాత్రమే కాదు. మనిషి అంతరంగంలో నివసించే అహంకారం, స్వార్థం, క్రోధం, అసూయ, కామం వంటి దుర్గుణాలకు అతడు ప్రతీక. మనలోని ఈ అసుర లక్షణాలను తుదముట్టించడమే నిజమైన ఆత్మపరిశీలన. అలాగే దేవీ నవరాత్రుల్లో జగన్మాతను శక్త్యవతారాలుగా ఆరాధిస్తాం. కానీ నిజ జీవితంలో మహిళలను పూజలకే పరిమితం చేస్తూ... వారి విద్య, ఉపాధి, ఆస్తి హక్కులు, నిర్ణయాధికారాల్లో వివక్ష చూపిస్తే ఆ ఆరాధ నకు అర్థం లేదు. బాలికలకు నాణ్యమైన విద్య, మహిళలకు సమాన అవకాశాలు, పని ప్రదేశాల్లో రక్షణ, స్వేచ్ఛ కల్పించినప్పుడే స్త్రీశక్తికి అసలైన సామాజిక గౌరవం దక్కుతుంది.
సామాజిక చైతన్య వేదికలుగా..
ముఖ్యంగా తెలంగాణలో నవరాత్రుల వేళ పూల పండుగ ‘బతుకమ్మ’ ప్రకృతితో ప్రజలకున్న అనుబంధాన్ని చాటుతుంది. విజయదశమి నాడు నిర్వహించే ‘ఆయుధ పూజ’ లేదా ‘పనిముట్ల పూజ’ శ్రమ గౌరవానికి పీఠం వేస్తుంది. జీవనోపాధికి ఆధా రమైన పరికరాలను పూజించడం వెనుక ఉన్న అసలైన ఆంతర్యం.. రైతు, కార్మికుడు, శ్రమజీవుల శ్రమను గుండెల్లో పెట్టుకుని గౌరవించడమే! శ్రమించే చేతులకు తగిన వేతనం, గౌరవప్రదమైన భద్రత కల్పించినప్పుడే ఏ సమాజమైనా నిజమైన ప్రగ తిని సాధించగలుగుతుంది.
మరోవైపు పండుగ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటూనే శబ్ద కాలుష్యం, ప్లాస్టిక్ విని యోగాన్ని అరికట్టి పర్యావరణహితంగా నిర్వహించడం భవిష్యత్ తరాల పట్ల మనకున్న సామాజిక బాధ్యత. విజయదశమి కేవలం ఆచారాల నిర్వహణకు పరిమితం కాకూడదు. బలాన్ని, అధికారాన్ని ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి కాకుం డా అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఉపయోగించాలి.
రాజ్యాంగం అందించిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే విలువలను మన ఆచరణలో నిలబెట్టుకోవాలి. మనలోని స్వార్థాన్ని వీడి సమాజ హితం కోసం ముందడుగు వేద్దాం. అధర్మంపై ధర్మం, అజ్ఞానంపై జ్ఞానం, వివక్షపై సమానత్వం, ద్వేషంపై మానవత్వం విజయం సాధించినప్పుడే పండుగ సందేశానికి సార్థకత చేకూరుతుంది!
వ్యాసకర్త సెల్: 9849042083