సబ్ ప్లాన్ నిధుల వినియోగంలో వేగం పెంచండి
అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ వర్గాల(SC and ST communities) అభ్యున్నతికి బడ్జెట్లో కేటాయించిన సబ్ ప్లాన్ నిధులను(Sub-plan funds) పూర్తిస్థాయిలో వినియోగించడానికి వేగం పెంచాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆదేశించారు. కేటాయింపులకు తగ్గట్టు నిధుల వ్యయాన్ని వేగవంతం చేయడంతోపాటు నిధుల వినియోగంలో వెనుకబడిన శాఖలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను(State Economy) మరింత పటిష్టం చేసేందుకు ఆర్థిక శాఖలో సంస్కరణలు, ఆదాయ వనరుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు.
సచివాలయంలో సోమవారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ ప్రోగ్రెస్ సబ్ ప్లాన్ అమలు, శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, ఇప్పటివరకు జరిగిన వ్యయం, రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు సంబంధించిన అంశాలను రివ్యూ చేశారు. కేటాయించిన నిధులు నిర్దేశిత లక్ష్యాలకు తగ్గట్టు ఖర్చయ్యేలా సంబంధిత శాఖలు బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. జనాభా ప్రాతిపదికన కేటాయించిన సబ్ ప్లాన్ నిధులు ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధికి సమర్థవంతంగా ఉపయోగపడేలా శాఖలవారీగా వ్యయ ప్రణాళికలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
నిధుల వినియోగంలో వెనుకబడిన శాఖలతో ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి, ఖర్చుల పురోగతిని వేగవంతం చేయాలని సూచించారు. ఈ మేరకు ముందుగా ఖర్చులో ఎక్కువ గ్యాప్ ఉన్న వ్యవసాయం, వైద్యం, ఇంధనం, పురపాలక, పంచాయతీరాజ్, సాంఘిక సంక్షేమం, పరిశ్రమలు, గిరిజన సంక్షేమ, తరువాత క్రమంలో ఇతర శాఖల కార్యదర్శులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఆయా శాఖలకు కేటాయించిన నిధులు, ఇప్పటివరకు జరిగిన వ్యయం, మిగిలిన నిధుల వినియోగానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించి, నివేదిక రూపొందించాలని సూచించారు.
ఆర్థిక నిపుణుల సేవలు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతోపాటు, అదనపు ఆదాయ మార్గాలను గుర్తించాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ రూపకల్పనలో వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ.. వ్యయ నియంత్రణ, నిధుల సద్వినియోగం, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక వనరుల లభ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆర్థిక నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలను పాటించేందుకు అనుభవజ్ఞులైన కన్సల్టెంట్లు, ఆర్థిక రంగ నిపుణుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో ఫైనాన్స్, ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ సిక్తా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.