కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

17-09-2026 | 12:26pm

హనుమకొండ, సెప్టెంబర్ 17(విజయ క్రాంతి): సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని హనుమకొండ కాంగ్రెస్ పార్టీ(Congress Party) కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ సంస్థానం రజాకారుల పాలన నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనమవడానికి ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు, పోరాటాలు కీలకమని అన్నారు.

నాటి స్వాతంత్ర్య పోరాటం నుంచి హైదరాబాద్ విమోచన ఉద్యమం వరకు ప్రజల హక్కుల కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాతావరణంలో ప్రజాస్వామ్య పద్ధతిలో వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. హైదరాబాద్ సంస్థానం విముక్తి కోసం జరిగిన పోరాటంలో కాంగ్రెస్ పార్టీతో పాటు అనేక మంది నాయకులు, ప్రజలు కీలక పాత్ర పోషించారని తెలిపారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు