ఇది రేవంత్‌రెడ్డి తెచ్చిన కరువు

11-09-2026 | 05:05am

‘పాలమూరు పులి’.. నీటి వినియోగంలో పిల్లిలా వ్యవహారం

ప్రాజెక్టుల మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లివ్వాలి

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణలో నీళ్లు అందుబాటులో ఉన్నా రైతుల పొలాలకు అందించలేని దుస్థితి నెలకొందని, ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) నిర్లక్ష్యం వల్ల వచ్చిన కరువని మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) విమర్శించారు. ‘పాలమూరు పులి’.. నీటి వినియోగంలో పిల్లిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు నీళ్లు లేకున్నా.. ఏపీకి మాత్రం ఫుల్‌గా వదులుతున్నారని ఆరోపించారు.

వెలిగొండ ద్వారా ఏపీకి నీటి తరలింపును వెంటనే అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. పాలమూరు ప్రాజెక్టుల మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. రాష్ట్రంలో సాగు, తాగునీరు, విద్యుత్ పరిస్థితులపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. ‘పాలమూరు పులి’ అని చెప్పుకునే సీఎం.. నీటి వినియోగంలో పిల్లిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

కృష్ణా జలాలు అందుబాటులో ఉన్నప్పటికీ తెలంగాణలోని ప్రాజెక్టుల మోటార్లు పూర్తిస్థాయిలో నడపడం లేదని తెలిపారు. ‘తెలంగాణ రైతాంగానికి నీళ్లు నిల్లు.. ఏపీ రైతాంగానికి నీళ్లు ఫుల్లు’ అన్న పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. పాలమూరు బిడ్డను అని చెప్పుకునే రేవంత్‌రెడ్డి.. కృష్ణా జలాలను ఎత్తకుండా పాలమూరు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. కల్వకుర్తి ఎత్తిపో తల పథకంలోని ఎల్లూరు పంప్‌హౌస్‌లో ఐదు మోటార్లు నడపగల సామర్థ్యం ఉన్నప్పటికీ కేవలం రెండు మోటార్లే నడుపుతున్నారని తెలిపారు.

అవి కూడా ఆన్ పద్ధతిలో నడుస్తున్నాయని, సగటున రోజుకు 11 గంటలే పనిచేస్తున్నాయని అన్నారు. రోజుకు 1,600 క్యూసెక్కులు రావాల్సిన చోట 700 క్యూసెక్కులే వస్తున్నాయని పేర్కొన్నారు. భీమా ప్రాజెక్టులో మూడు మోటార్లకు ఒకటే నడుపుతున్నా రని, నెట్టంపాడులో నాలుగింటికి ఒకటి, కోయిల్‌సాగర్‌లో మూడింటికి ఒకటి మాత్రమే నడుపుతున్నారని ఆరోపించారు. బేసిన్‌లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులను పక్కన పెట్టి బేసిన్‌తో సంబంధం లేని వెలిగొండ ద్వారా ఏపీ నీటిని తరలించుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకో వడం లేదన్నారు.

పోతిరెడ్డిపాడు, వెలిగొండ ద్వారా ఏపీకి నీటి తరలింపును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. పాలమూరు- ఎత్తిపోతల పథకంలోని పెండింగ్ పనులను పూర్తి చేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. పాలమూరు ప్యాకేజీ- పనులు నెలరోజులు కష్టపడితే పూర్తయ్యే స్థితిలో ఉన్నా మూడేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ పనులు పూర్తయితే మరో 56 లక్షల ఎకరాలకు నీరు అందే అవకాశం ఉందన్నారు.

కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులకు కీర్తి దక్కుతుందనే కారణంతోనే వాటిని పూర్తి చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. అధికారిక లెక్కల ప్రకారం శ్రీశైలం నుంచి ఏపీ 35 టీఎంసీల నీటిని తీసుకెళ్లిందని, తెలంగాణ మాత్రం కేవలం 7 టీఎంసీలే ఎత్తుకుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రశ్నించిన తర్వాతే సాగర్‌కు కొద్ది కొద్దిగా నీటిని విడుదల చేస్తున్నారని అన్నారు. ‘బీఆర్‌ఎస్ నిలదీస్తే తప్ప ప్రభుత్వానికి మొద్దునిద్ర వీడదా?’ అని ప్రశ్నించారు. 

రైతులకు నీరందించాలి: మాజీ మంత్రి వేముల

నిజామాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో తమ సమస్యలను ప్రస్తావించాలని, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు కృషి చేయాలని రైతులు ఫోన్‌లు చేస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను సభలో ప్రస్తావిస్తామంటే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు