కారు పార్టీకి.. అహంకారం పోలె!

11-09-2026 | 05:35am

సబిత, సునీతలు కాంగ్రెస్‌లో ఎదిగినవారే

ప్రతిపక్ష కుట్రలను బలంగా తిప్పికొట్టాలి.. ఫామ్‌హౌస్ నుంచే కుట్రలు మొదలైనయ్

  1. జాతీయ జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి 
  2.   22 ఏపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం
  3. భూముల చిట్టా బయటపడుతుందనే హరీశ్‌లో ఆందోళన 
  4. అందరి చిట్టా బయటపెడుతాం 
  5. కేటీఆర్‌కు పోలీసుల్లోనూ రేవంత్‌రెడ్డినే కనిపించినట్లుంది
  6. వెయ్యి రోజుల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి 
  7. సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌(Bharat Rashtra Samithi)కు అధికారంపోయినా అహంకారం వీడటంలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ(Assembly) సజావుగా జరగకుండా ఫామ్‌హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former Chief Minister KCR) కుట్రలు చేశారని సీఎం మండిపడ్డారు. పోలీసు అధికారుల(Police officers)ను, ప్రజాప్రతినిధులను దూషించి మూడురోజులు సభ జరగకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అధికారులపై అనుచితంగా వ్యవహరించడం, మహిళా అధికారుల(women officers) ముందు టీషర్టులు విప్పి ఇబ్బంది కలిగించడం, స్పీకర్‌ను  అత్యంత అభ్యంతరకరంగా దూషించడం హేయమన్నారు. 

ప్రతిపక్ష కుట్రను బలంగా తిప్పికొట్టి, ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలకు తెలియజేసిన ప్రజా ప్రతినిధులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. భవిష్యత్‌లోనూ ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం అసెంబ్లీ కమిటీ హాల్‌ల్లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(Congress Legislature Party) (సీఎల్పీ) సమావేశం జరిగింది. ఈ భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఇందులో అసెంబ్లీలో అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. మాజీ ఎమ్మెల్యేలు కొమ్మిడి నరసింహారెడ్డి, వంగా సుబ్బారావు, జీ సిద్దయ్య మృతిపై సంతాపం వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ప్రతిపక్షం తీరు, అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, భవిష్యత్ వ్యూహంపై నేతలకు దిశాని ర్దేశం చేశారు. స్పీకర్‌ను దూషించినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యక్రమం చేపడితే దళితులు నడిచిన నేలను శుద్ధిచేసి అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జరిగిన సంఘటనలపై విచారణ చేపట్టడం జరిగిందని స్పష్టంచేశారు.

సభ్యులు తప్పనిసరిగా సభలో చర్చల్లో పాల్గొనాలని, హాజరుశాతం తగ్గకుండా చూసుకోవాలని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ప్రజలు ఇచ్చిన హోదాను సరైన విధంగా ఉపయోగించుకోకపోతే భవిష్యత్తులో రాజకీయంగా రా ణించలేరని హెచ్చరించారు. అందరికీ వెసులుబాటుగా ఉండాలనే అత్యంత చారిత్రక భవనంలో శాసనమండలిని నిర్వహిస్తున్నామని, అసెంబ్లీలో సెంట్రల్ హాల్‌ను ప్రారం భించుకుని మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టుకున్నామని సీఎం గుర్తుచేశా రు.

సభ్యులు సభలో తమ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావిం చాలని, అసెంబ్లీ జరిగినన్ని రోజులు సంపూ ర్ణ హాజరు ఉండాలని ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వకపోతే సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రస్థాయి నాయ కులుగా ఎదిగేవారా?  అని ప్రశ్నించారు. పో లీస్ సిబ్బందిపై దాడి ఘటనను ప్రస్తావి స్తూ.. కేటీఆర్‌కు పోలీసుల్లో రేవంత్ రెడ్డి కనిపించినట్లున్నారని, అంత ఆక్రోశంతో అధికా రులపై దాడులు చేశారని ఎద్దేవా చేశారు.

ఓటర్ల జాబితాపై అప్రమత్తత.. 

దేశానికి మనం చేసిన కులగణన రోల్ మోడల్ అని, ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత అని సీఎం అన్నారు. తెలంగాణ నమూనాను జాతీయ స్థాయిలో అమలుచేయాలని, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల ని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలవాలనుకునే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కాపాడే అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.

దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లు గా తేలితే, ఓటర్ల జాబితా మాత్రం 88 కోట్లు గా చూపుతున్నారని, దేశంలో 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఎక్కడో ఏదో ప్రమాదం పొంచి ఉందని, ఎస్‌ఐఆర్ అంశాన్ని సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సభ్యుల ప్రతి ప్రవర్తన రెండోసారి గెలుపుపై ప్రభావం చూపుతుందని, వ్యక్తిగత పనితీరు గెలుపు ఓటములను నిర్ణయిస్తుందని గుర్తుచేశారు. వెయ్యి రోజుల పాలనకు సహకరించిన అం దరికీ ధన్యవాదాలు తెలిపారు. 

మనది ఒకే మాట, ఒకే బాటగా..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కలిసి పనిచేస్తే కుట్రలను ఎలా ఛేదించగలమో చేసి చూపించామని, బీఆర్‌ఎస్ నాయకుల తీరు, వారి భాష, శుద్ధీక రణపై సభ్యులందరం గట్టిగా ఎత్తిచూపి కట్టడి చేయగలిగామని అన్నారు. మనమం తా ఒకటే మాట.. ఒకటే బాటగా ఇదే పోరా ట స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయలేదని, మనం చేసుకోవాల్సిన ప్రచారం చేసుకోక పోవడం వల్లే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టవుతోందని, సరైన విధంగా ప్రచారం చేసుకుంటే ఆ ప్రవాహంలో ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయని భట్టి తెలిపారు.

సంక్షేమం, విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజలకు తెలియజేయాలని, దేశంలో ఎక్కడా లేనివిధంగా 27 లక్షల మంది విద్యార్థులకు హైజెనిక్ బ్రేక్ ఫాస్ట్ అం దిస్తున్నామన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నా మన్నారు. చిన్న పొరపాటు లేకుండా కులసర్వే నిర్వహించి అసెంబ్లీలో ఆమోదించుకు ని కేంద్రానికి పంపామన్నారు.

ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమాను అమలు చేయబోతున్నామని, ఉద్యోగులకు కోటి రూపా యల బీమా అందిస్తున్నామని, మనం చేసిన పను లే మనల్ని గెలిపిస్తాయని భట్టి ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం చేసిన పనులపై ప్రతీ గ్రామంలో ఇంటింటికీ ప్రచారం జరగాలి. మన సంక్షేమ పథకాలపై లబ్ధిదారులు చాలా సంతృప్తిగా ఉన్నారు. ప్రచార కార్యక్రమాన్ని పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలని భట్టి సూచించారు. 

సర్‌పై అప్రమత్తంగా ఉండాలి..

పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో ‘సర్’ ప్రక్రియ దుర్మార్గంగా జరుగుతుందన్నారు. సర్‌పైన సీఎం రివ్యూ చేశారని తెలిపారు. పెద్దసంఖ్యలో ఓట్లను తొలగిస్తున్నారని ఆయన విమర్శించారు. దళితులు, గిరిజనుల ఓట్లనే ఎక్కువగా తొలగిస్తున్నారని, ఎమ్మెల్యేలు సర్ ప్రక్రియ పైన దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

రాష్ట్రంలో ఇస్తు న్న అభివృద్ధి, సంక్షేమం దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదని, సామాజిక న్యాయం తెలంగాణలోనే అమలవుతున్నదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి బీసీ బిడ్డ కాకపోయినా బీసీ రిజర్వేషన్ల  కోసం ముందుకు వచ్చారని, అయితే కేంద్ర ప్రభుత్వం సహకరించ డం లేదని మండిపడ్డారు. వచ్చే రెండున్నర సంవత్సరాలు కీలకమని ప్రతిఒక్కరు ఇప్పటినుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు. 

బీఆర్‌ఎస్ గ్రాఫ్ పడిపోయింది.. 

అసెంబ్లీ ఘటన తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ గ్రాఫ్ చాలా పడిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి  అన్నారు. ఇటీవల 3 రోజుల పాటు అసెంబ్లీలో జరిగిన రాజకీయ పరిణామాలు, ప్రతిపక్షాల తీరుపై తాము ఓ ఫ్లాష్ సర్వే చేయించామని, ఈ సర్వేలో బీఆర్‌ఎస్ గ్రాఫ్ భారీగా పడిపోయినట్లుగా స్పష్టమైందని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రు లు, విప్‌లు, ఎమ్మెల్యేలు అంతా సమన్వయంతో బాగా పనిచేశారని వారిని అభినందించా రు.

రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన 22 ఏ నిషేధిత భూముల జాబితా అం శంపై ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పేద ప్రజలకు, రైతాంగానికి మేలుచేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంటే, దాన్ని తప్పుదోవ పట్టించేలా బీఆర్‌ఎస్ నేతలు యత్నిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై లబ్ధిపొందేందు కు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.

అదేవిధంగా మాజీ మంత్రి హరీష్‌రావుపై సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హరీష్‌రావు ధరణి పోర్టల్ ద్వారా అక్రమంగా రాయించుకున్న భూముల చిట్టా అంతా తమ వద్ద సిద్ధంగా ఉందని హెచ్చరించారు. త్వరలోనే బీఆర్‌ఎస్ నేతల అక్రమాలు, అవినీతికి సంబంధించిన పూర్తి చిట్టాను బయటపెడతామని స్పష్టంచేశారు. ప్రతిపక్ష నేతల బండారం ప్రజల ముందు బట్టబయలు చేస్తామని, ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

పలు సమస్యలపై మంత్రులు..

సీఎల్పీ సమావేశంలో కూడా వివి ధ సమస్యలపై మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో నీళ్ల సమస్యపైన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. నీళ్ల కరువును తట్టుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక బద్ధ్దంగా ముందు కు వెళ్లుతోందని, అయితే ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వం విమర్శలు  చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు బీఆర్‌ఎస్ హ యాంలోనే అన్యాయం జరిగిందని, ఇ ప్పుడు తెలంగాణకు రావాల్సిన నీటి వాటా కోసం పోరాటం చేస్తున్న విషయాన్ని మంత్రి వివరించారు. ఇక జన గణనలో బీసీ కాలమ్ పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

అందుకు కేంద్రంపై ఒత్తిడి మరింత ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక 22 ఏ నిషేధిత భూముల కు సంబంధించిన అంశాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. ధరణి వల్లే భూములకు ఇబ్బందులు కలిగాయన్నారు. 22 ఏ వల్ల ఏ ఒక్కరికి అన్యాయం జరగదన్నారు.  22 ఏపైన ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను ప్రతి ఒక్కరు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలన్నా రు. అంతేకాకుండా 22 ఏపైన పట్టాదారులకు ఎక్కడైనా ఇబ్బందులుంటే ప్ర భుత్వం దృష్టికి తీసుకురావాలని పొం గులేటి సూచించినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు