అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తాం: మున్సిపల్ చైర్‌పర్సన్

26-11-2026 | 01:56pm

జగిత్యాల, నవంబర్ 26 (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తూ బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా పనిచేస్తామని జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి అన్నారు. నవంబర్ 26 రాజ్యాంగ అవతరణ దినోత్సవం (Constitution Day) సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో 16వ వార్డు కౌన్సిలర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ దుమాల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ (Dr. BR Ambedkar) బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసి భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిన మహనీయుడని కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, హక్కుల (Fundamental Rights) ఫలితంగా ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ నాయకత్వంలో మున్సిపాలిటీ తరఫున అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా, పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

అంబేద్కర్ ఆశయ సాధనకు తమ వంతు బాధ్యతగా ముందుండి జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమ నిర్వాహకులకు, అంబేద్కర్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గట్టు సతీష్, కౌన్సిలర్లు మనపూరి పవిత్ర-మహేష్, బొల్లారపు స్వప్న-గిరిధర్, బడుగు పద్మ-రాజేందర్, కో-ఆప్షన్ సభ్యులు, దళిత, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు