రాజ్యాంగ పరిరక్షణకు ఐక్యంగా కదిలిరావాలి

26-11-2026 | 01:12pm

నల్లబెల్లి, నవంబర్ 26 (విజయక్రాంతి): భారత రాజ్యాంగం (Indian Constitution) అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి, హక్కుల పరిరక్షణకు గొప్ప ఆయుధమని దళిత మేధాశక్తి (డీఎంఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు, న్యాయవాది బొట్ల పవన్ అన్నారు. నల్లబెల్లి మండల అధ్యక్షుడు జన్ను కరుణాకర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 60 దేశాల రాజ్యాంగాలను (Constitutions) అధ్యయనం చేసి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని దేశానికి అందించారని కొనియాడారు. రాజ్యాంగంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఆధిపత్య శక్తుల పట్ల ప్రజాస్వామ్యవాదులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్టీలకు అతీతంగా ఐక్యమై కులవివక్ష లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో డీఎంఎస్ నాయకులు అడ్డ రాజు, పెంబర్తి శ్రీనివాస్, నత్తి శ్యామ్, గంగారం వినయ్, నత్తి చిరంజీవి, బొట్ల దయాకర్, కోడెపాక రవి, జన్ను రవి, కొయ్యడ కుమారస్వామి, జన్ను జయరావు, పోడేటి సాగర్, జన్ను సాగర్, బరుపట్ల నరేష్, నాగేలి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు