అమిత్ షాను కలిసిన రామాయణం టీమ్
న్యూఢిల్లీ: బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న ‘రామాయణం: పార్ట్ 1’ చిత్రబృందానికి(Ramayana Part 1 Team) కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) అభినందనలు తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఆయనను సినిమా నిర్మాతలు, దర్శకుడు, నటీనటులు కలిశారు. భారతీయ ఇతిహాసాన్ని భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించిన తీరును అమిత్ షా ప్రశంసించారు.
ఈ భేటీలో నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేశ్ తివారీ, హీరో రణ్బీర్ కపూర్(Ranbir Kapoor), హీరోయిన్ సాయిపల్లవి(Sai Pallavi), సహ నిర్మాత నీరజ్ సంఘాయ్ పాల్గొన్నారు. రామాయణం చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని అమిత్ షా ప్రస్తావించడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది.
నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. తాజా ట్రేడ్ నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.1,755 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో రూ.2,000 కోట్ల మైలురాయికి చేరువవుతోంది.
సినిమా విజయానంతరం రణ్బీర్ కపూర్ బుధవారం ఢిల్లీలోని ప్రసిద్ధ గురుద్వారా బంగ్లా సాహిబ్(Gurudwara Bangla Sahib)ను సందర్శించి ప్రార్థనలు చేశారు. దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా కూడా ఆయన వెంట ఉన్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించారు. సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో నటించారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందించారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఇతిహాస చిత్రానికి మొదటి భాగం సాధించిన విజయంతో రెండో భాగంపై కూడా అంచనాలు పెరిగాయి.