ఉగ్రదాడి బెదిరింపు.. పోలీసుల హైఅలర్ట్

26-11-2026 | 10:20am

హైదరాబాద్: నగరంలో ఉగ్రదాడులు జరగవచ్చంటూ వచ్చిన ఓ బెదిరింపు ఈమెయిల్ కలకలం రేపింది. దీంతో హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) అప్రమత్తమై కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్(Kachiguda Railway Station), హోటల్ టూరిస్ట్ ప్లాజాను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామంటూ నవంబర్ 21న పోలీసులకు ఈ మెయిల్ అందింది. లష్కరే తోయిబా పేరుతో వచ్చిన ఈ సందేశంలో 26/11 ముంబై దాడుల తరహాలో హైదరాబాద్‌లోనూ దాడులు చేస్తామంటూ హెచ్చరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాది లతీఫ్ భట్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా దాడులకు పాల్పడతామంటూ అందులో పేర్కొన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజా(Hotel Tourist Plaza)లో బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ప్రాథమిక విచారణలో ఈ బెదిరింపు మెయిల్ బూటకమని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు తాత్కాలిక ఈమెయిల్ ఐడీ ద్వారా సందేశం పంపిన వ్యక్తిని గుర్తించేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు(Hyderabad Cyber ​​Crime Police) దర్యాప్తు చేస్తున్నారు. మెయిల్ మూలాలు, ఐపీ అడ్రస్, వీపీఎన్ వినియోగం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేశారు.

బెదిరింపు నేపథ్యంలో రైల్వే స్టేషన్లు, హోటళ్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసుల నిఘా పెంచారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే 112కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, నిర్ధారణ లేని వార్తలు, వదంతులను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు