కులరహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి

26-11-2026 | 01:10pm

జగిత్యాల, నవంబర్ 26 (విజయక్రాంతి): భారత రాజ్యాంగం (Indian Constitution) బహుజన, అణగారిన వర్గాల ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రాథమిక హక్కులు కల్పించిందని జగిత్యాల జిల్లా మా ఐక్య వేదిక అధ్యక్షుడు సూరమళ్ల సతీష్ అన్నారు. నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవాన్ని (Constitution Day) పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ముఖ్య అతిథి సూరమళ్ల సతీష్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు అనేక సవాళ్లను ఎదుర్కొని రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

రాజ్యాంగం కల్పించిన హక్కుల ఫలితంగానే నేడు బహుజన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు గ్రామపంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు రాజకీయ పదవులతో పాటు విద్యా, ఉద్యోగ, న్యాయ, పరిపాలనా రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారని అన్నారు. అణగారిన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి విద్యే ప్రధాన ఆయుధమని, ప్రతి ఒక్కరూ విద్యావంతులై రాజ్యాంగ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ కులరహిత సమాజ నిర్మాణానికి రాజ్యాంగం (Social Justice) బలమైన పునాదిగా నిలిచిందన్నారు. సివిల్ రైట్స్ దినోత్సవం సందర్భంగా మండలంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి రాజ్యాంగ హక్కులు, వాటి ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ రాజ్యాంగం అందించిన ప్రజాస్వామ్య స్ఫూర్తి కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసీ పీవీటీజీ రాష్ట్ర అధ్యక్షురాలు మడావి మంజుల, ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కురిసెంగ వేణు, తక్కళ్ల దేవయ్య, చిత్తారి ప్రభాకర్, గిద్దె శంకర్, ముద్దమళ్ల ఆనంద్, ప్రవీణ్ కుమార్, కాయితి శ్రీనివాస్, గొడిసెల అశోక్ రాజు, సుద్దాల జగదీశ్వర్, కంటె అంజయ్య, దాసండ్ల కమలాకర్, గొడిసెల రమేష్, దుమాల రాజ్ కుమార్ తదితర అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు