మంత్రులకు మోదీ అలర్ట్

26-11-2026 | 01:57pm

న్యూఢిల్లీ: పార్లమెంట్(Parliament) తదుపరి సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) తన మంత్రివర్గ సహచరులకు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. డిసెంబర్ 15 లోపు పార్లమెంట్ సమావేశాల(Parliament Session) నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, అప్పటివరకు విదేశీ పర్యటనలకు వెళ్లకుండా అందుబాటులో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.

బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల అంశం చర్చకు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రతి మంత్రిత్వ శాఖ తన పరిధిలోని అంశాలు, ప్రతిపాదిత బిల్లులు, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని ప్రధాని సూచించినట్లు సమాచారం. తదుపరి సమావేశాల ప్రారంభ తేదీ, ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాలను పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(Cabinet Committee on Parliamentary Affairs) ఖరారు చేయనుంది.

తదుపరి పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ అమలు, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలు కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ అంశాలపై గతంలో అధికార, ప్రతిపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో రాబోయే సమావేశాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి.

ఆగస్టు 13న ముగిసిన వర్షాకాల సమావేశాల అనంతరం పార్లమెంట్ తదుపరి భేటీపై స్పష్టత లేకపోవడాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలోనే సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశముంది. ఇది శీతాకాల సమావేశమా లేక ప్రత్యేక సమావేశమా అన్నది అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టమవుతుంది.

మరిన్ని వార్తలు