నర్సింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

27-11-2026 | 01:21pm

జగిత్యాల,(విజయక్రాంతి): గిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల(Government Nursing College) హాస్టల్లో మూడవ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని గురువారం సాయంత్రం మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థినులు(Students) ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఆలస్యంగావెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బాధితురాలు స్పందిస్తూ.. తోటి విద్యార్థులు, అధ్యాపకుల వేధింపులే(Harassment) తన ఆత్మహత్యాయత్నానికి కారణమని ఆరోపించింది.

ఈ విషయమై ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఫిర్యాదు తర్వాత వేధింపులు మరింత పెరిగాయని ఆవేదన వ్యక్తం చేసింది. అసభ్యపదజాలంతో దూషిస్తూ, పిచ్చి పట్టిందంటూ ఎగతాళి చేశారని తెలిపింది. ఘటన బయటకు రాకుండా ఆస్పత్రికి తరలించేలా కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేసిందని ఆరోపించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ అధికారికంగా  స్పందించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు