పోలీస్ విభాగాల్లో ప్రాక్టికల్ శిక్షణ పొందనున్న ట్రైనీ డీఎస్పీలు

23-11-2026 | 07:36pm

జగిత్యాల, నవంబర్ 23 (విజయక్రాంతి): పోలీస్ శాఖలో విధులు, బాధ్యతలు, పోలీసింగ్ విధానాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రాక్టికల్ శిక్షణ ఎంతో కీలకమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్(SP Ashok Kumar) అన్నారు. పోలీస్ శిక్షణలో భాగంగా 24 వారాల పాటు వివిధ పోలీస్ విభాగాల్లో క్షేత్రస్థాయి ప్రాక్టికల్ శిక్షణ పొందేందుకు జగిత్యాల జిల్లాకు కేటాయించబడిన ట్రైనీ డీఎస్పీలు తేజస్విని, నరేందర్ శిక్షణ నిమిత్తం జిల్లాలో రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ట్రైనీ డీఎస్పీలకు జిల్లాలో కేటాయించిన వివిధ ప్రాక్టికల్ ట్రైనింగ్ యూనిట్లు, ఆయా విభాగాల పనితీరు, విధులు, బాధ్యతలు, పోలీస్ శాఖ నిర్వహించే వివిధ కార్యకలాపాల గురించి వివరించారు. శిక్షణ కాలాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ పోలీస్ శాఖలోని ప్రతి విభాగం పనితీరుపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ల నిర్వహణ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ విధులు, కేసుల నమోదు, నేర పరిశోధన, నిందితుల గుర్తింపు, సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు విధానాలు, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి నేర్చుకోవాలని తెలిపారు.

అదేవిధంగా ట్రాఫిక్ నిర్వహణ, బందోబస్తు విధులు, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ పరిష్కారం, మహిళలు, బాలల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. 24 వారాల శిక్షణ కాలంలో వివిధ పోలీస్ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధులను ప్రత్యక్షంగా పరిశీలించాలని, ప్రతి అంశాన్ని ఆసక్తితో నేర్చుకుంటూ భవిష్యత్తులో సమర్థవంతమైన పోలీస్ అధికారులుగా ఎదగాలని సూచించారు.

మరిన్ని వార్తలు