ప్రమాద నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు

23-11-2026 | 07:31pm

వాహనదారుల భద్రతే లక్ష్యం: చేయూత ఫౌండేషన్ ఫౌండర్ బానోత్ నరేష్ నాయక్..

కోనరావుపేట నవంబర్ 23 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టు కుడి కాలువ వద్ద రోడ్డుపై ఉన్న వంతెన దగ్గర రాత్రి వేళల్లో వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా చేయూత ఫౌండేషన్(Cheyutha Foundation) ఆధ్వర్యంలో ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. వంతెనకు ఇరువైపులా వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు అందించే సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.

రాత్రి సమయంలో ఈ ప్రాంతంలో ప్రయాణించే వాహనదారులకు వంతెనను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో, ప్రమాదాలను ముందుగానే నివారించాలనే ఉద్దేశంతో ఈ సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు చేయూత ఫౌండేషన్ ఫౌండర్ బానోత్ నరేష్ నాయక్ తెలిపారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. వాహనదారులు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ప్రయాణించాలని, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇస్లావత్ రాజ్ నాయక్, గణేష్, శ్రీనివాస్, సాగర్, అజయ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు