డంపింగ్ యార్డ్ ఎత్తివేతే

13-11-2026 | 06:23pm
  1. జేఏసీ కమిటీలో కో కన్వీనర్ గా చామకూర మహేందర్ రెడ్డి
  2. డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి

జవహర్ నగర్, నవంబర్ 13 (విజయక్రాంతి): జవహర్ నగర్ డంపింగ్ యార్డ్(Jawahar Nagar Dumping Yard) ఎత్తివేతే లక్ష్యంగా ఈనెల 15వ తేదీ నుండి రిలే నిరసన దీక్షలు చేపడతామని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్(Jawahar Nagar Dumping Yard) ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి పిలుపునిచ్చారు.

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 15వ తేదీ నుండి చేపట్టనున్న రిలే నిరసన దీక్షలకు మద్దతుగా నిలబడాలని కోరుతూ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తనయుడు మహేందర్ రెడ్డి కి శుక్రవారం రోజు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల జవహర్ నగర్ దమ్మాయిగూడ కాప్రా కీసర శామీర్పేట ఘట్కేసర్ యాప్రాల్ చెంగిచెర్ల తదితర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక ప్రజా ప్రతినిధిగా మల్లారెడ్డి కి తెలుసునన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు ఇచ్చిన హామీల పట్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారని అన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల రోజుకు ఇద్దరు లేదా ముగ్గురు చనిపోతున్నారని గుర్తు చేశారు. భూగర్భ జలాలు కలుషితం కావడం తాగునీరు పనికిరాకుండా పోవడంతో ప్రజలు ఆరోగ్యపరంగా పలు శారీరక మానసిక బాధలకు గురవుతున్నారని పేర్కొన్నారు. వీటికి నిరసనగా ఈనెల 15వ తేదీ నుండి రిలే నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

ఈ ఉద్యమానికి అండగా నిలబడాలని శాసనసభలో ఈ సమస్యను బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరితో కలిసి డంపింగ్ యార్డ్ ను శాశ్వతంగా ఎత్తివేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీలో కో కన్వీనర్ గా కొనసాగడానికి మేడ్చల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మహేందర్రెడ్డి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కోశాధికారి ఐఎఫ్టియు శివ బాబు, కన్వీనర్లు బి ఆర్ఎస్ ఆలూరి రాజశేఖర్, మాజీ కార్పొరేటర్ పల్లపు రవి, ప్రవీణ్, జాన్, మల్లేష్, జయ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు