రైతు బీమా ఉంటే సాయమందేది
- ఆ పథకాన్ని కాంగ్రెస్ రద్దు చేసింది
- ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి
- మాజీ మంత్రి హరీశ్‌రావు
- ఉద్యమకారుడు లక్ష్మణ్‌గౌడ్ కుటుంబానికి పరామర్శ
- 10 లక్షల ఆర్థిక సాయం అందజేత
- లక్ష్మణ్ భార్యకు ఉద్యోగం కల్పిస్తామని హామీ
జనగామ, నవంబర్ 10 (విజయక్రాంతి): ‘కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన రైతుబీమా పథకాన్ని(Farmer Insurance Scheme) కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. రైతుబీమా పథకం అమలులో ఉంటే రైతుల కుటుంబాలకు వెంటనే ఆర్థిక సహాయం అందేది’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్ కార్యకర్త లక్ష్మణ్‌గౌడ్ కుటుంబాన్ని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో మంగళవారం హరీశ్‌రావు పరామర్శించారు. లక్ష్మణ్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష్మణ్ భార్యకు ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. జేసీబీ సీజ్, అప్పుల భారం, పంట నష్టం, భూమి ప్రొహిబిషన్ జాబితాలో చేరడంతో కుటుంబం ఇబ్బందులకు గురై లక్ష్మణ్‌గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు వివరించారని హరీశ్‌రావు తెలిపారు.
లక్ష్మణ్‌కు ఉన్న జేసీబీపై కాంగ్రెస్ ప్రభుత్వం మైనింగ్ కేసు పెట్టి, సీజ్ చేసి, నెలల పాటు పోలీస్ స్టేషన్‌లో పెట్టి, పెనాల్టీలు వేస్తే ఆ వాహనం బయటకు రాకుండా చేశారని ఆరోపించారు. లక్ష్మణ్ తనకున్న ఏడు ఎకరాలతోపాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాడని చెప్పారు.
నీరు లేక, బోర్లు పడక పెట్టుబడి అంతా పోయి, పంట ఎండిపోయి, పంట చేతికి రాని పరిస్థితి రావడంతో కొత్త అప్పులు మీద పడ్డాయన్నారు. వీటితో పాటు కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్, జానారెడ్డి పీఆర్వోగా చెప్పబడుతున్న వ్యక్తి.. లక్ష్మణ్‌కు ఉన్న భూమి తమది అని దరఖాస్తు పెడితే స్పందించిన కలెక్టర్ వెంటనే ప్రొహిబిషన్ లిస్ట్‌లో పెట్టారని ఆరోపించారు.
దీంతో ఆ భూమిని అమ్ముకునే అవకాశం కూడా పోయిందన్నారు. ఈ కారణంగా అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. వాస్తవాలు ఒకటైతే కాంగ్రెస్ దుష్ప్రచారం చేసి రాజకీయం చేయడం చాలా -దురదృష్టకరమన్నారు. లక్ష్మణ్ కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.