ఆధునిక వ్యవసాయానికి బ్యాంకు రుణ భరోసా

02-11-2026 | 10:43pm

వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు రైతులకు రుణాల పంపిణీ

గణపురం,నవంబర్ 02  (విజయ క్రాంతి): రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను(Modern agricultural methods) అందిపుచ్చుకొని, ఉత్పాదకతను పెంచుకునేలా తెలంగాణ గ్రామీణ బ్యాంకు రుణ సదుపాయాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం గణపురం శాఖలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్) పథకం కింద వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు రైతులకు రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ పథకం ద్వారా 9 శాతం వడ్డీ రేటుతో రుణాలు అందించడంతో పాటు, అర్హులైన రైతులకు 3 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తున్నారు. ట్రాక్టర్లు, డ్రోన్లు, హార్వెస్టర్లు తదితర ఆధునిక వ్యవసాయ పరికరాల కొనుగోలుకు ఈ రుణాలు ఉపయోగపడనున్నాయి.ఈ సందర్భంగా బ్యాంకు ప్రాంతీయ మేనేజర్ జీపీఎస్ చైతన్య కుమార్ మాట్లాడుతూ, ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగంతో రైతులు సాగులో ఉత్పాదకత పెంచుకోవడంతో పాటు, శ్రమ, పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవచ్చని తెలిపారు. ఏఐఎఫ్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో  మేనేజర్ గంట రాజేందర్ రెడ్డి, బ్యాంకు సిబ్బంది, పలువురు రైతులు పాల్గొన్నారు. రుణాలు పొందిన రైతులు బ్యాంకు అందిస్తున్న రుణ సదుపాయాలు, వడ్డీ రాయితీ పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు