విస్తరణ పేరుతో విధ్వంసం

07-11-2026 | 05:10am
  1. అధికారుల పర్యవేక్షణ కరువు 
  2. ధ్వంసమవుతున్న మంచినీటి పైపులైన్లు 
  3. రోడ్లన్నీ బురదమయం
  4. ఇబ్బందులు పడుతున్న ప్రజలు 

గణపురం, నవంబర్ 6 (విజయ క్రాంతి): గణపురంలో  రోడ్డు విస్తరణ పనులు(Road widening works) విధ్వంసం సృష్టిస్తున్నాయి. కూలీలే అధికారులుగా మారి ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా సైడ్ కాలువల నిర్మాణం కోసం జెసిబి యంత్రంతో తవ్వుతున్న సందర్భంగా మంచినీటి పైపులైన్లు ధ్వంసం అవుతున్నాయి. దీంతో రోజుల తరబడి స్థానికులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బం దులు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు.

రోడ్డు విస్తరణలో భాగంగా సైడు కాలువల కోసం తవ్విన గుంతలను సక్రమంగా మట్టితో పూడ్చకపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. అదేవిధంగా నిర్మించిన సైడు కాలువలకు అవసరమైన మేర నీటిని చల్లకపోవడంతో నిర్మాణ పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల సమీపంలో రహదారిపై తవ్విన గుంతను ఇప్పటివరకు పూడ్చకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

రాత్రివేళ ఈ గుంత ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్, అధికారులు, పనులను పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. రోడ్డు నిర్మాణ పనులు కూడా ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయని, పనుల పర్యవేక్షణ లోపించిందని ఆరోపిస్తున్నారు. పనులు నత్తనడకన సాగుతుండటంతో దుమ్ము, మట్టి, గుంతల కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

రోడ్డు విస్తరణ పనులతో గృహ సముదాయాలు, దుకాణ సముదాయాల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుకాణాల ముందు గుంతలు, మట్టి పేరుకుపోవడంతో వినియోగదారులు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి కాంట్రాక్టర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. పనులు జరిగే చోట అధికారులు ఎవరూ లేకుండానే ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా అధికారులు స్పందించి పనులు ప్రణాళిక బద్ధంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రణాళిక లేకుండా పనులు చేస్తున్నారు 

రోడ్డు విస్తరణ పనులు అధికారుల పర్యవేక్షణ లేకుండా ప్రణాళిక బద్ధంగా జరగడం లేదు. ఇండ్ల ముందు సైడ్ కాల్వ కోసం గుంతలు తవ్వి రోజుల తరబడి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సైడ్ కాలువలు పూర్తయిన చోట మట్టి పోయడం లేదు. దీంతో దుకాణ సముదాయాలు గృహ సముదాయాల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జెసిబి యంత్రాలతో ఇష్టరాజ్యంగా తవ్వకాలు చేపట్టడం వల్ల మంచినీటి పైపులైన్లు ధ్వంసంమై ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి పనులు ప్రణాళిక బద్ధంగా జరిగేలా చూడాలి. 

-మార్క లక్ష్మణ్ గౌడ్, గణపురం

మరిన్ని వార్తలు