ఓపిక, సహనంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
విద్యార్థులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె.జీవన్‌కుమార్ పిలుపు
భూపాలపల్లి,(విజయక్రాంతి): విద్యార్థులు జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపిక, సహనంతో ఉన్నత చదువులు చదివి లక్ష్యాలను సాధించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె.జీవన్‌కుమార్(District Principal Judge J. Jeevan Kumar) సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జంగేడులోని కేజీబీవీ బాలికల పాఠశాలలో నిర్వహించిన సురక్ష బచ్పన్ అభియాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు, సైబర్ నేరాల(Cyber crimes) పట్ల అప్రమత్తంగా ఉండాలని, పాఠశాల స్థాయి నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆదర్శనీయులను అనుసరిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి తాడూరు మహతి వైష్ణవి, జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్‌కుమార్ నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి.అఖిల, సీఐ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి, పాఠశాల ప్రిన్సిపాల్ ఈశ్వరి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.