పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ విస్తరణతో హైదరాబాద్‌కు మరో మైలురాయి
నూతన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ బ్లాక్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు
రూ. లక్షల కోట్ల ఐటీ రంగ అభివృద్ధికి దోహదం అదనంగా 10 వేల సీట్ల ఏర్పాటు, 13 వేల మందికి పైగా ఉపాధి అవకాశాల లక్ష్యం
ఘట్ కేసర్,(విజయక్రాంతి) : తెలంగాణను ప్రపంచస్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా హైదరాబాద్‌లోని పోచారం ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. పోచారం క్యాంపస్‌లో నూతనంగా నిర్మించిన 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలోని సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ బ్లాక్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం ప్రారంభించారు. ఈ విస్తరణతో తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, యువతకు అధునాతన సాంకేతిక రంగాల్లో ఉపాధి అవకాశాలు పెంచనున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది.
450 ఎకరాల్లో విస్తరించి ఉన్న పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో ఇప్పటికే ఏడు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు, సుమారు 4.58 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ విస్తీర్ణం ఉన్నాయని, తాజాగా ప్రారంభించిన నూతన భవనంతో అదనంగా 10 వేల ఉద్యోగుల సీటింగ్ సామర్థ్యం అందుబాటులోకి రానుందని తెలిపారు. హైబ్రిడ్ వర్కింగ్ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని మరో 13 వేల మందికి పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశాలను సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని. ఈ విస్తరణతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంజనీరింగ్, నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ సేవల్లో ఇన్ఫోసిస్ సామర్థ్యాలు మరింత పెరగనున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, రిటైల్, లైఫ్ సైన్సెస్, తయారీ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థలకు ఈ కేంద్రం సేవలు అందించనుంది.
ఈసందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన యువత, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణంతో తెలంగాణ ప్రపంచ సాంకేతిక కేంద్రంగా ఎదుగుతోందన్నారు. పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ విస్తరణ రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధిలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పెట్టుబడులు యువతకు నూతన ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు హైదరాబాద్‌ను అంతర్జాతీయ ఐటీ గమ్యస్థానంగా మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని వివరించారు. ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘరాజ్ కా మాట్లాడుతూ హైదరాబాద్ తమ సంస్థ వృద్ధి ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తోందని, పోచారం క్యాంపస్ విస్తరణ తెలంగాణ పట్ల సంస్థకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. కొత్త కేంద్రం ద్వారా ప్రపంచస్థాయి క్లయింట్లకు అధునాతన సాంకేతిక సేవలు అందించడంతో పాటు, ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ప్రతిభావంతులను తీర్చిదిద్దేందుకు అవకాశం కలుగుతుందన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ నూతన భవనంలో విద్యుత్ ఆదా చేసే రేడియంట్ కూలింగ్ వ్యవస్థ, స్మార్ట్ లైటింగ్, వర్షపు నీటి సంరక్షణ, మురుగునీటి పునర్వినియోగం, సహజ కాంతి అందేలా ప్రత్యేక నిర్మాణ ఏర్పాట్లు చేశారు. ఉద్యోగుల ఆరోగ్యం, సౌకర్యం, పరస్పర సహకారంతో పనిచేసే వాతావరణానికి అనుగుణంగా ఆధునిక సదుపాయాలను కల్పించారు. ఈకార్యక్రమంలో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్ ధారేశ్వర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నీలాద్రి ప్రసాద్ మిశ్రా, తెలంగాణ ప్రభుత్వ, ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.