విద్యార్థినుల భద్రతే షీ టీం లక్ష్యం: షీ టీం ఎస్ఐ స్వప్న కుమారి
భూపాలపల్లి టౌన్ (విజయక్రాంతి): విద్యార్థినిల భద్రతే షీ టీం లక్ష్యం అని షీ టీం ఎస్ఐ స్వప్న కుమారి(She Team SI Swapna Kumari) అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని కేజిబీవి కళాశాలలో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీం ఎస్ఐ స్వప్న కుమారి మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోరాదని, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. మహిళలు, బాలికలు ఎదుర్కొనే వేధింపుల్లో పరిచయస్తుల ప్రమేయం కూడా ఉంటుందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విద్యార్థినులు ప్రయాణ సమయంలో టీ సేఫ్ యాప్ ను వినియోగించడం ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా చేసుకోవచ్చని తెలిపారు. బాలికలకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే షీ టీం నెంబర్ 8712658162, అత్యవసర పరిస్థితుల్లో 112కు, సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.