గుండె ఆరోగ్యం పట్ల అవగాహన ర్యాలీ
గజ్వేల్, సెప్టెంబర్ 26: మెడిసిటీ మెడినోవా ఆసుపత్రుల(Medicity Medinova Hospitals) సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ గుండె ఆరోగ్య దినోత్సవాన్ని(World Heart Health Day)( సెప్టెంబర్ 29) పురస్కరించుకొని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గుండె ఆరోగ్యం పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇంద్ర పార్క్ కూడలి నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మాజీమంత్రి హరీష్ రావు, మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు.
కార్యక్రమంలో ప్రగతి కళాశాల విద్యార్థులు పాల్గొని ప్రజలకు గుండె ఆరోగ్యం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెడిసిటి మెడినోవా ఆసుపత్రుల ప్రతినిధులు మాట్లాడుతూ సెప్టెంబర్ 29 న ప్రపంచ గుండె ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్య పట్టణాలలో ప్రజలకు గుండె ఆరోగ్యం పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. శరీరంలో గుండె ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుందని, గుండె ఆరోగ్యం పట్ల అందరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మద్యపానం ధూమపానం తదితర చెడు అలవాట్ల వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. పౌష్టిక ఆహారాన్ని, కొవ్వులేని పదార్థాలను భుజించి గుండెను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో మెడినోవా జనరల్ మేనేజర్ పూర్ణచంద్ర, మెడిసిటీ మార్కెటింగ్ ఇంచార్జ్ కుమారస్వామి, సిబ్బంది సుధాకర్, శేఖర్ బాబు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.