మెడికల్ షాపుల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

28-10-2026 | 09:54pm

డీఎంహెచ్‌ఓకు పీడీఎస్‌యూ, ఐఎఫ్‌టీయూ నాయకుల వినతి

గద్వాల, అక్టోబర్ 28:  జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో ఔషధ నియంత్రణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని పీడీఎస్‌యూ, ఐఎఫ్‌టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి(Medical and Health Department Officer) వినతిపత్రం సమర్పించారు.

ప్రతి మెడికల్ షాపులో అర్హత కలిగిన రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అందుబాటులో ఉండేలా చూడాలని, డ్రగ్ లైసెన్సుల చెల్లుబాటును పరిశీలించాలని కోరారు. నకిలీ, గడువు ముగిసిన మందుల విక్రయాలను అరికట్టడంతోపాటు, వైద్యుల ప్రిస్క్రిప్షన్ అవసరమైన మందులను నిబంధనల ప్రకారమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే మెడికల్ షాపుల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హాలింపాష, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్, జమ్మిచేడు సుధాకర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు