ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన

28-10-2026 | 10:47pm

రొమ్ము క్యాన్సర్‌ అవగాహన(Breast Cancer Awareness) మాసం సందర్భంగా హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్‌ (హెచ్‌సీజీ విశాఖ), విశాఖపట్నంలోని ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల విద్యార్థులతో కలిసి   ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఫ్లాష్‌మాబ్‌ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై సమాజంలో నెలకొన్న అపోహలు, సంకోచాలను తొలగించేందుకు యువత భాగస్వామ్యాన్ని వినియోగించారు.

రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు, మహిళలు సకాలంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు. ఈ ప్రత్యక్ష ప్రదర్శనలో సుమారు 40 మంది కళాశాల విద్యార్థులు పాల్గొని, ప్రజల దృష్టిని ముందస్తు ఆరోగ్య పరిరక్షణ వైపు మళ్లించారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉంటాయని ఈ కార్యక్రమంలో వివరించారు. ఇందులో భాగంగా క్రమం తప్పకుండా మామోగ్రఫీ పరీక్షలు చేయించుకోవడంతోపాటు, గర్భాశయ ముఖద్వార ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు.

ఈ కార్యక్రమం గురించి హెచ్‌సీజీ ఆంకాలజీ, విశాఖపట్నం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్ ఐ.పీ. మాట్లాడుతూ.. “క్యాన్సర్‌ చికిత్సలో అభివృద్ధితోపాటు, వ్యాధిని తొలిదశలోనే గుర్తించాల్సిన అవసరంపై సమాజంలో అవగాహన పెరగాలి. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన అంటే కేవలం సమాచారాన్ని అందించడం మాత్రమే కాదు. మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునేలా, వైద్యులను సంప్రదించేలా, ఎలాంటి భయం లేకుండా స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలి. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, సమాజం సమన్వయంతో నిరంతరం కృషి చేసినప్పుడే ఆశించిన మార్పు సాధ్యమవుతుంది. ఫ్లాష్‌మాబ్‌ వంటి కార్యక్రమాలు సమాజంలో చర్చకు దారితీస్తాయి.

పాతకాలపు సంకోచాలను తొలగించి, ముందస్తు ఆరోగ్య పరీక్షల ప్రాధాన్యాన్ని పెంచుతాయి. మహిళల్లో అవగాహన కల్పించడమే కాకుండా, వారికి సరైన సమయంలో తగిన వైద్య సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ గుంటూరు ఇందిర మాట్లాడుతూ.. “క్యాన్సర్‌ చికిత్సలో ప్రస్తుతం అవగాహన లోపం, వ్యాధి నిర్ధారణలో జాప్యం ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. సామాజిక అపోహలు, సరైన సమాచారం లేకపోవడం వల్ల చాలామంది క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి వెనుకాడుతున్నారు. ఫలితంగా వ్యాధి ముదిరిన తర్వాత నిర్ధారణ అవుతోంది.

మరిన్ని వార్తలు