సింగిల్ విండోలకు దొడ్డి దారిన నియామకాలు...
తాడ్వాయి,అక్టోబర్,06( విజయ క్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు(Primary Agricultural Cooperative Societies) కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డి దారిన నియామకాలు చేస్తుందని తాడువాయి సింగిల్ విండో మాజీ చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి విమర్శించారు.ఈ సందర్భంగా ఆయన తాడువాయిలో మంగళవారం మాట్లాడుతూ... ప్రభుత్వం రైతులకు తెలియకుండా రైతుల ఓట్లను చోరీ చేస్తుందని ఘాటుగా స్పందించారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి నియామకాలు చేపట్టాలి కానీ ఎలాంటి ఎన్నికలు లేకుండా సింగిల్ విండో చైర్మన్ లను,డైరెక్టర్లను నియమించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారినే ఛైర్మెన్లు గా, డైరెక్టర్గా నియమించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో సంబంధిత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని ప్రతి రైతుకు చైర్మన్ గా, డైరెక్టర్ గా ఎన్నికయ్యే హక్కు ఉంటుందని తెలిపారు.
కానీ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లకుండా నియామకాలు చేపట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.ఎన్నికలకు వెళ్లాలంటే ప్రభుత్వం భయపడుతుందన్నారు. రైతులకు యూరియా పంపిణీలో,నాణ్యమైన కరెంటు తరపరాలో విఫలం కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు దొడ్డిదారిన నియామకాలు నిర్వహించకుండా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
తమకు పదవులు శాశ్వతం కాదని తమ పదవీకాలం పూర్తయిందని తెలిపారు. కానీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించి పారదర్శకంగా చైర్మన్ లను,డైరెక్టర్లను రైతులు ఎన్నుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో డైరెక్టర్ పీసు రాజిరెడ్డి పాల్గొన్నారు.