ఎండుతున్న పంట
- ఆందోళనలో పత్తి రైతులు...
- పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు...
తాడ్వాయి,అక్టోబర్, 21( విజయక్రాంతి): ఎలినినో ప్రభావంతో(El Nino effect) ఈ సంవత్సరం సరైన వర్షాలు కురవపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసుకున్న పంటలు కళ్ళముందే ఎండిపోతుంటే కన్నీరు పెట్టుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలంలో ప్రతీ సంవత్సరం రైతులు పత్తి పంటను(Cotton crop) సాగు చేస్తుంటారు. ఈ సంవత్సరం సైతం రైతులు(Farmers) పత్తి పంటను సాగు చేసుకున్నారు.
మండలంలో దాదాపు 3 నుంచి 4 వేల ఎకరాలలో పత్తి పంటను సాగు చేశారు.తాడువాయి మండలంలోని భూములు పత్తి పంటకు అనుకూలంగా ఉండడంతో రైతులు ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. తాడువాయి మండలంలోనే కాకుండా రాజంపేట, గాంధారి,సదాశివ నగర్,మాచారెడ్డి, రామారెడ్డి,పిట్లం, బిచ్కుంద,మద్నూర్, పెద్దకొడప్గల్, బాన్సువాడ మండలాల్లో సైతం పత్తి పంటను రైతులు సాగు చేశారు.
ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు పెట్టుబడి...
రైతులు ఒక ఎకరా పత్తి పంట సాగు చేయడం కోసం రూ. 30 వేల నుంచి రూ.40 వేల పెట్టుబడి పెట్టారు.గత నెల రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పత్తి మొక్కలకు పూత, గూడ వచ్చిందని సరైన వర్షాలు లేకపోవడంతో పూత గూడ కళ్ళ ముందే రాలిపోతుంటే కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు.ఒకటి రెండు వర్షాలు పడి ఉంటే పంట దక్కేదని వాపోతున్నారు. ప్రతిరోజు వర్షం కోసం రైతులు ఆకాశానికేసి చూస్తున్నారు.గత 6 రోజుల నుంచి వాతావరణ శాఖ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో సంబరపడిపోయారు. కానీ వర్షాలు పడకపోవడంతో నిరాశ చెందారు.
ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి..
వర్షాలు సకాలంలో పడి ఉంటే ఒక ఎకరాకు పది క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి వచ్చేది. దీంతో రైతులకు మంచి ఆదాయం సమకూరేది.ఈ సంవత్సరం పంటలకు మంచి మద్దతు ధర లభిస్తుందడంతో పత్తి పంటకు సైతం క్వింటాలకు రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు మద్దతు ధర పలికేదని రైతులు తెలిపారు. మాకు మంచి ఆదాయం సమకూరేదని అంటున్నారు.సరైన వర్షాలు లేకపోవడంతో వేసుకున్న పంట పూర్తిగా దెబ్బతిందన్నారు. ప్రస్తుతం ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి నెలకొందన్నారు.కొన్ని పొలాల్లో అసలు ఎకరాకు క్వింటాలు రెండు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదని రైతులు బోరు మంటున్నారు.
ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి...
ప్రభుత్వ స్పందించి పత్తి రైతులను ఆదుకోవాలని రైతుల కోరుతున్నారు.సరైన వర్షాలు లేకపోవడంతో పత్తి పంట తో చాలా నష్టపోయామని తెలిపారు.ప్రభుత్వం స్పందించి కచ్చితంగా రైతుల పంటలు సర్వే చేసి పరిహారం అందించేల చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.