రెవెన్యూ సర్టిఫికెట్ల జారీలో జాప్యం లేదు
మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దు: తహసీల్దార్ స్వప్న
దోమకొండ, అక్టోబర్ 15 (విజయ క్రాంతి): రెవెన్యూ సర్టిఫికెట్ల జారీలో(Issuance of Revenue Certificates) ఎలాంటి అనవసర జాప్యం లేదని దోమకొండ తహసీల్దార్ స్వప్న(Domakonda Tahsildar's dream) స్పష్టం చేశారు. సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే కొనసాగుతోందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తున్నామని తెలిపారు.
గతంలో మాదిరిగా మాన్యువల్ విధానం కాకుండా ప్రస్తుతం డిజిటల్ ప్రక్రియ ద్వారా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు మీ సేవ కేంద్రాల్లో లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) క్షేత్రస్థాయి పరిశీలన, ధ్రువీకరణ అనంతరం తహసీల్దార్ లాగిన్లో ఆమోదం పూర్తవుతుందని వివరించారు.
ఈ ప్రక్రియ సిటిజన్ చార్టర్ నిబంధనల ప్రకారం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే జారీ అయిన సర్టిఫికెట్లను తిరిగి పొందేందుకు మీ సేవ కేంద్రాల్లో రీప్రింట్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు.సర్టిఫికెట్లు త్వరగా ఇప్పిస్తామంటూ కొందరు మధ్యవర్తులు, దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని తహసీల్దార్ స్వప్న తెలిపారు.
ప్రజలు అలాంటి వ్యక్తులను ఆశ్రయించవద్దని, ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వారి వివరాలను అధికారులకు తెలియజేయాలని కోరారు. తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని సూచించారు.రెవెన్యూ సేవలకు సంబంధించి ఏవైనా సందేహాలు, సమస్యలు ఉంటే ప్రజలు నేరుగా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుంటే సంబంధిత ప్రక్రియను పూర్తి చేసి సర్టిఫికెట్లు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.