రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి
- సింగరేణి బకాయిలు చెల్లించి బొగ్గు ఉత్పత్తిని పెంచాలి
- ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే విద్యుత్ సంక్షోభానికి కారణం
- విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 15 ( విజయక్రాంతి ) : రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Former MLA Gandra Venkataramana Reddy) అన్నారు. ఈ మేరకు గురువారం గండ్ర విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ ముందుచూపు లేని నిర్ణయాలు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థపై సరైన ప్రణాళిక లేకపోవడమే ప్రధాన కారణాలని ఆరోపించారు.
విద్యుత్ కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జెన్కో, ట్రాన్స్కో, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, సింగరేణి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గడం, ఓవర్బర్డెన్ టెండర్లలో రాజకీయ జోక్యం, అవినీతి ఆరోపణలు వంటి అంశాలు బొగ్గు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.
బొగ్గు సరఫరా సక్రమంగా లేకపోతే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుందని, దాని ప్రభావం రాష్ట్ర విద్యుత్ వ్యవస్థపై పడుతుందని ఈ అంశాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అధికారులను సస్పెండ్ చేయడం సమస్యకు పరిష్కారం కాదని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి సరిపడా విద్యుత్ ఉత్పత్తి కావాలి, అవసరమైన బొగ్గు సరఫరా జరగాలి, ముందస్తు ప్రణాళికతో విద్యుత్ కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు.
విద్యుత్ కొరత ఏర్పడే అవకాశాలపై ముందుగానే అంచనా వేసి, అవసరమైతే విద్యుత్ మిగులు ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. గతంలో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో యూనిట్కు రూ.12 నుంచి రూ.13 చెల్లించి అయినా విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేశామని గుర్తుచేశారు. భూపాలపల్లి ప్రాంతంలోని చెల్పూర్ జెన్కో విద్యుత్ కేంద్రం సహా రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని అన్నారు.
చెల్పూర్ విద్యుత్ కేంద్రంలో సుమారు 1,100 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికి కేవలం 400 నుంచి 600 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుందని దీనికి బొగ్గు కొరత కూడా కారణమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కారం కాకపోతే, వారి పక్షాన మరోసారి ఉద్యమానికి దిగుతామని, అవసరమైతే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.