వైన్ షాపులు రెండే.. బెల్ట్ షాపులు వందలా?
- అధికారుల నిఘా ఎక్కడ?
- అలసత్వమా..? మామూళ్ల మత్తా?
బిచ్కుంద, నవంబర్ 6 (విజయక్రాంతి): రెండు అధికారిక వైన్ షాపులకు వందల సంఖ్యలో అక్రమ బెల్ట్ షాపులు..(Illegal Belt Shops) ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బెల్ట్ షాపుల విచ్చలవిడి నిర్వహణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రెండు అధికారిక మద్యం దుకాణాలు ఉంటే వాటికి అనుబంధంగా వందల సంఖ్యలో అక్రమ బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా మద్యం విక్రయాలు సాగుతున్నప్పటికీ సంబంధిత పోలీస్, ఆబ్కారీ (ఎక్సైజ్) శాఖల అధికారులు తగిన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బెల్ట్ షాపుల కారణంగా గ్రామాల్లోని వీధులు, కూడళ్లు, జనావాసాల సమీపంలో మద్యం విక్రయాలు సాగుతున్నాయి. దీంతో మద్యం సేవించి గొడవలకు దిగడం, కుటుంబ కలహాలు, రోడ్డు ప్రమాదాలు, శాంతిభద్రతల సమస్యలు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువత మద్యానికి బానిసలవుతుండగా, పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతోంది.
అధికారులకు కనిపించడం లేదా?
బహిరంగంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకోవడం కాకుండా, బెల్ట్ షాపుల మూలాలను గుర్తించి వాటి నిర్వహణ వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా స్పందించాలి!
జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లా ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గ్రామాలు, పట్టణాల్లో అక్రమ బెల్ట్ షాపులపై సమగ్ర తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేసి ప్రజల ఆరోగ్యం, కుటుంబాల ఆర్థిక భద్రత, గ్రామీణ ప్రాంతాల ప్రశాంతతను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
బెల్ట్ షాపులపై చర్యలు
కామారెడ్డి జిల్లాలో బెల్ట్ షాపుల నిర్వహణను అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. బెల్ట్ షాపులు కొనసాగుతున్న విషయం తమ దృష్టికి వస్తే కేసులు నమోదు చేస్తున్నాం. బెల్ట్ షాపుల నిర్వాహకులను ఉపేక్షించేది లేదు. బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంటున్నాం.
ముకుంద రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్, కామారెడ్డి