పాటలే... ప్రాణంగా.....కలమే... కర్తవ్యం గా...

14-10-2026 | 02:32pm

పద్యాలు.... పాటలతో... దూసుకెళ్తున్న రవీందర్.....

తాడ్వాయి,అక్టోబర్, 14( విజయ క్రాంతి): ఆయన ఒక సాదాసీదగా ఉన్న నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ప్రాథమిక స్థాయి(Primary level), ఉన్న స్థాయి విద్యలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో(Government school) పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ కామారెడ్డి లోని గంజి వర్తక సంఘం కళాశాలలో, డిగ్రీ ఆర్కే డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. అనంతరం డి ఈ డి నిజామాబాద్ లోని డైట్ కళాశాలలో చదివారు.

ఆయనే పద్యాలు కవితలు రాస్తూ దూసుకెళ్తున్న కౌడి రవీందర్. పేదల బతుకులు బయట ప్రపంచానికి చూపించాలని తపనతో సమాజంలో జరుగుతున్న అవినీతిని బయట పెట్టాలనే ఆకాంక్షతో పద్యాలు,పాటలు రాస్తూ ముందుకు వెళ్తున్నారు రవీందర్. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామ నివాసి అయిన రవీందర్ తనకంటూ కవిత్వంలో  ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తపన పడుతున్నారు.

డైట్ కళాశాలలో ఉన్నప్పుడే కవితల వైపు...

ఆయన డైట్ కళాశాలలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్న సమయంలోనే కవితలు రాయడం ప్రారంభించారు. అధ్యాపకుడు తల్లవజ్జల మహేష్ బాబు మీకు ఎవరికైనా కవితలు రాయొచ్చా కవితలు రాయగలరా కవితలు రాయడం అంటే అంత సులభం కాదు అనే ప్రశ్నకు ఎందుకు రాయలేనని రవీందర్ సంకల్పం తీసుకొని పద్యాలు కవితలు రాసి శభాష్ అనిపించుకున్నారు.

అప్పటి నుంచి ప్రారంభమైన కవిత్వం దూసుకుపోతూనే ఉంది. అంతకుముందు ఆయన సాధారణంగా పాఠశాలలో కళాశాలలో జానపద గేయాలు పాటలు పాడేవాడు.అదే అభిరుచిగా ఆయన ప్రయాణం కవిత్వం వైపు మళ్ళింది.

ఇప్పటికే రెండు పుస్తకాల ఆవిష్కరణ...

ఇప్పటికే రవీందర్ 2 తాను రాసిన పుస్తకాలను ఆవిష్కరించారు. నీలకంఠ శతకం, నా తెలంగాణ పుస్తకాలు(Telangana Books) రాసి కవులను అబ్బురపరచాడు. కవిత్వంలో తాను గురువులుగా భావించే పద్య కవి అష్టావధాని తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కార గ్రహీత బెజుగామ రామమూర్తి, ప్రముఖ గజల్ కవి సీనిగేయ రచయిత తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కార గ్రహీత అయిన సూరారం శంకర్ ల సలహాలు సూచనలతో సామాజిక అంశాలు పై దృష్టి పెట్టి ఆట వెలది పద్యాలతో మొదటి సారి నీలకంఠ శతకం రూపొందించడం జరిగిందన్నారు.

కవిత్వంలో మరింత ముందుకు వెళ్ళడానికి తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు అయిన గపూర్ శిక్షక్ కృషి చేశాడన్నారు. అనంతరం 2015లో తెలంగాణ చరిత్ర సంస్కృతి, సాంప్రదాయాలు తొలి మలి దశ తెలంగాణ ఉద్యమ పోరాట వీరులు వంటి అంశాలు కలిగిన రెండో పుస్తకం నా తెలంగాణ శతకం రాయడం జరిగిందని రవీందర్ తెలిపారు. తాను రాసిన పుస్తకాలను ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు అందించినట్లు తెలిపారు.

అదరగొట్టిన కామారెడ్డి జిల్లా పాట.. 

రవీందర్ రాసిన కామారెడ్డి జిల్లా పాట జిల్లా వాసులను అదరగొట్టింది.ఈ పాటలో అనేక అంశాలు పొందుపరిచి రాయడంతో ప్రముఖులు మెచ్చుకున్నారు. అప్పటి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మెమొంటోతో సత్కరించారు. 

సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతా...

తాను మరిన్ని కవితలు రాస్తూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతాను.తన వంతు బాధ్యతగా కవిత్వాలు రాస్తూ ముందుకు వెళ్తాను. తన కవితలు పాటలు ఎప్పటికైనా సినిమాలలో రావాలని,తనకు ఒక సినీ గేయ రచయితగా గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. గుర్తింపు వచ్చేదాకా పోరాటం చేస్తూనే ఉంటానని తెలిపారు. 

మరిన్ని వార్తలు