ధర్మారెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సి.బి.ఆర్.ఎమ్ సమావేశం

30-10-2026 | 08:05pm

నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 30 (విజయ క్రాంతి):స్వయం సహాయక సంఘాల రుణాల రికవరీపై(Recovery of loans from self-help groups) సమీక్ష, మొండి బకాయిల వసూలుకు ప్రత్యేక కార్యాచరణ మండలంలోని ధర్మారెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో(Telangana Grameena Bank) ఈ రోజు సిబిఆర్ఎం సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో బ్యాంకు పరిధిలోని వివిధ గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసిన బ్యాంకు రుణాల చెల్లింపుల తీరు, మొండి బకాయిల వసూళ్లు,రుణ లక్ష్యాల సాధన తదితర అంశాలపై  వివోఏల వారీగా సమగ్ర సమీక్ష నిర్వహించారు.

బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మొండి బకాయిల వసూలుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, క్షేత్రస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం కొమ్మ దత్తు మాట్లాడుతూ...ప్రతి గ్రామంలోని అర్హత కలిగిన స్వయం సహాయక సంఘాలన్నింటికీ బ్యాంకు లింకేజీ రుణాలు అందేలా  సిసిలు,వివోఏలు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.

మహిళల ఆర్థిక స్వావలంబన,జీవన ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న వడ్డీలేని రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రతి గ్రామంలోనూ రుణాల రికవరీపై నిరంతర పర్యవేక్షణ చేపడుతూ.. ఎలాంటి మొండి బకాయిలు లేకుండా  సిసిలు,వివోఏలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్  జ్ఞానేశ్వర్ కుమార్ మాట్లాడుతూ...గ్రామ సంఘాల పరిధిలో బకాయిలు కలిగిన స్వయం సహాయక సంఘాలు తమ పాత రుణ బకాయిలను పూర్తిగా చెల్లించినట్లయితే, తిరిగి బ్యాంకుల ద్వారా రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ భాను, సిసిలు రవి, పెంటయ్య,సావిత్రి, వివోఏలు,గ్రామ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు