సోయాలతో ఆనందం...

16-10-2026 | 06:13pm

మద్దతు ధర... మంచి ఆదాయం...

తాడ్వాయి,అక్టోబర్, 16( విజయ క్రాంతి ): ప్రతీ సంవత్సరం సోయాబీన్ పంట(Soybean crop) వేసుకున్న రైతులు సరైన దిగుబడి రాక గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడేవారు.కానీ ఈ సంవత్సరం అందుకు భిన్నంగా సోయా పంటకు మంచి డిమాండ్ ఉండడంతో రైతులు ఆనందపడుతున్నారు. ఈ సంవత్సరం సోయా పంట మంచి దిగుబడి రావడంతో రైతులు సంబరపడుతున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో రైతులు ఈ పంట వేసుకున్నారు.

ఈ పంట తక్కువ సమయంలోనే కోతకు వస్తుంది.ఈ సంవత్సరం ఒక ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి రావడంతో రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. దిగుబడితోపాటు పంటకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది.గతంలో ఒక క్వింటాలు సోయాకు రూ.4 వేల నుంచి రూ.4200 మాత్రమే ధర ఉండేది. కానీ ఈ సంవత్సరం అందుకు భిన్నంగా క్వింటాలుకు రూ.6600 నుంచి రూ. 7000 ధర పలుకుతుంది.

ఎకరాకు 66 వేల నుంచి 70 వేల ఆదాయం..

ఈ సంవత్సరం రైతులు పండించిన సోయాకు ఎకరాకు 66 వేల నుంచి  70 వేల ఆదాయం వస్తుందని రైతులు తెలిపారు.గతంలో ఎకరాకురు 30 వేల నుంచి 40 వేలు రావడమే కష్టంగా ఉండేదన్నారు.కానీ ఈ సంవత్సరం మంచి దిగుబడి మంచి ధర రావడంతో రైతులు సంతోషంగా ఉన్నారు.

ఖరీఫ్ లో సోయా కాకుండా మొక్కజొన్న,పత్తి పంటలు సాగు చేసుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కజొన్న పంట కంకులు కాకుండానే ఎండిపోతుంది.పత్తి పంట సరైన దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. కనీసం పంటకు పెట్టిన పెట్టుబడులు అయినా వచ్చే అవకాశం లేదని రైతులు బోరుమంటున్నారు.

మరిన్ని వార్తలు