రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్లు పై మెరుపు దాడులు
- మానవ వినియోగానికి పనికిరాని 15 కిలోల కల్తీ ఆహార పదార్థాలు ద్వంసం
- ఆహార భద్రతాధికారి ఆధ్వర్యంలో తనిఖీ లు
కామారెడ్డి, నవంబర్ 2 (విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లాలో ఆహార భద్రత అధికారులు(Food Safety Officials) మెరుపు దాడులకు దిగారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలనే లక్ష్యంతో ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో సోమవారం రెస్టారెంట్లు, ఆహార విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కామారెడ్డి పట్టణంలోని అల్ సుభాన్ రెస్టారెంట్‌ను ఆహార భద్రత అధికారి విక్రమ్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా చికెన్ కూరలు, వేయించిన అన్నం తదితర వంటకాల తయారీలో అనుమతిలేని కృత్రిమ ఆహార రంగులు వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
వంటశాల అపరిశుభ్రంగా ఉండటం, వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, వంట సిబ్బంది తల కవర్లు, చేతి తొడుగులు, ఏప్రాన్లు ధరించకపోవడం వంటి లోపాలను గుర్తించారు. మానవ వినియోగానికి పనికిరాని సుమారు 15 కిలోల నిల్వ ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. అనుమానిత ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. కామారెడ్డి పట్టణంలోని ఎస్‌ఎస్‌ఎస్ టిఫిన్ సెంటర్‌ను తనిఖీ చేశారు.
అక్కడ వంటశాల అపరిశుభ్రంగా ఉండటం, వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వంటి పరిశుభ్రతా లోపాలను గుర్తించారు. సంబంధిత సంస్థకు మెరుగుదల నోటీసు జారీ చేసి, అనుమానిత ఆహార నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. ప్రయోగశాల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆహార పదార్థాల్లో నిబంధనలకు విరుద్ధంగా కృత్రిమ రంగులు కలపడం నిషేధమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.