రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది...

01-10-2026 | 05:40pm

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి...

బాన్సువాడ, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం ప్రతి గింజలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy)అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ సొసైటీ పరిధిలోని కొల్లూరు గ్రామంలో, బుడ్మి సొసైటీ పరిధిలోని తాడకోల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పోచారం  మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో ఖరీఫ్ వరి ధాన్యం కోతలు ఇతర జిల్లాలతో పోలిస్తే ముందుగానే ప్రారంభమయ్యాయని తెలిపారు.ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల ప్రకారం అర్హత కలిగిన సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 ప్రోత్సాహక బోనస్ అందించనున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం ఏ-గ్రేడ్ ధాన్యాన్ని క్వింటాలుకు రూ.2,461, కామన్ గ్రేడ్ ధాన్యాన్ని రూ.2,441 చొప్పున కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి, పొల్లు లేకుండా, తేమ శాతం 17 శాతంలోపు ఉండేలా సిద్ధం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. తద్వారా ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు