బడుగు బలహీన వర్గాల నేత బిరుదు రాజమల్లు
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి నియోజకవర్గం(Peddapalli Constituency)లో రాజకీయాలకు వన్నెతెచ్చిన మహోన్నత నాయకుడు మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు(Former MLA Birudu Rajamallu) అని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Chintakunta Vijaya Ramana Rao) అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు చౌరస్తా వద్ద జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి 76వ జన్మదిన వేడుకలను నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుల్తానాబాద్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి సర్పంచ్, ఎంపీపీ, ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా అనేక పదవులను అనుభవించి రాజకీయాలలో తనదైన ముద్రను వేశారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అనుచర గణంతోపాటు అభిమానులను సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి బిరుదు రాజమల్లు అని కొనియాడారు. తాను కూడా రాజ మల్లన్నకు ప్రియ శిష్యుడినేనని, అవినీతికి తావు లేకుండా పాలనను అందించారనికొనియాడారు.
బిరుదు రాజమల్లు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం బిరుదు జయంతిని పురస్కరించుకొని నిరుపేదలకు అందిస్తున్న చీరలను మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి అందించారు. రాజమల్లు కుటుంబ సభ్యులు, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మాజీ వైస్ చైర్మన్ బిరుదు సమత లు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిరుదు రాజమల్లు సతీమణి సుశీలతోపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అనుచర గణం, వివిధ గ్రామాల సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సింగిల్ విండో చైర్మన్ లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.