కాంగ్రెస్ పాలనలో కరువు విలయతాండవం

15-10-2026 | 05:18pm
  1. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు
  2. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ ఘాటు విమర్శలు

హుజురాబాద్, అక్టోబర్ 15: (విజయక్రాంతి): రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చినవి కావని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఏర్పడ్డాయని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్(BRS State Secretary Banda Srinivas) విమర్శించారు. గురువారం హుజురాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వందలాది క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నా, వాటిని వినియోగించుకునే ప్రణాళిక ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ, మాజీ సీఎం కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే భయంతో ప్రభుత్వం రైతాంగానికి అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ ముందుచూపు లేమితో సాగు, తాగునీటి సమస్యలు తీవ్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ పాలనలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించామని, ప్రస్తుతం విద్యుత్ అంతరాయాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యుత్ కోతల కారణంగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోతూ రైతులు నష్టపోతున్నారని, గృహ వినియోగదారులు, వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యుత్ సరఫరాతో పాటు సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల అమలుపై దృష్టి సారించకుండా ఢిల్లీ పర్యటనలకే పరిమితమైతే ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గందె శ్రీనివాస్, ఇరుమళ్ల సురేందర్ రెడ్డి, కొలిపాక శ్రీనివాస్, కటుకూరి మల్లారెడ్డి, వర్థినేని రవీందర్ రావు, తాళ్లపల్లి శ్రీనివాస్, గఫార్, ధనవర్ష రాజు, ఆర్కే రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు