పంటలు వేయొద్దనడం సిగ్గుచేటు

16-10-2026 | 07:26pm

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రణాళిక ఏదీ

కరీంనగర్‌ సిటీ అక్టోబర్ 16 (విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంటూ రైతులను ఆందోళనకు గురిచేయడం కాకుండా, విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికను వెల్లడించాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌(Former MLA Sunke Ravishankar) డిమాండ్‌ చేశారు. యాసంగి పంటలు వేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రైతులకు 24 గంటల విద్యుత్తు అందించాల్సి ఉండగా, కొన్ని ప్రాంతాల్లో నాలుగు గంటలే సరఫరా అవుతోందని రవిశంకర్‌ ఆరోపించారు. విద్యుత్తు కోతలతో పంటలకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనరేటర్లను వినియోగించాల్సి రావడంతో రైతులపై అదనంగా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు భారం పడుతోందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

కరువు ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. పంటలు వేయొద్దని సూచించడం ఏమిటని ప్రశ్నించారు. క్రాప్‌ హాలిడే ప్రకటిస్తే, రైతులకు ఎకరానికి రూ.30 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు

తెలంగాణలో ప్రాణహిత, గోదావరి వంటి నదులు ఉన్నప్పటికీ సాగునీటి సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయని రవిశంకర్‌ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు, అవసరమైన మరమ్మతులు చేపట్టి సాగునీటి వనరులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని తెలిసినప్పుడు ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీటిని అందుబాటులో ఉంచేందుకు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రైతులకు నిరంతర విద్యుత్తు అందించామని, కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించామని రవిశంకర్‌ పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదని ఆరోపించారు. 24 గంటల విద్యుత్తు, మూడు పంటలకు రైతుభరోసా, ఎకరానికి రూ.15 వేల సాయం వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్తు కేంద్రాల నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని, బొగ్గు సరఫరా, విద్యుత్తు ఉత్పత్తి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.

రైతులకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయడంతో పాటు, సాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో పెద్దఎత్తున సబ్‌స్టేషన్ల ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని సుంకె రవిశంకర్‌ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ , శాతవాహన విశ్వవిద్యాలయ ఇంచార్జ్ చుక్కా శ్రీనివాస్ , మాజీ సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు