‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదం స్ఫూర్తిదాయకం

28-09-2026 | 03:36pm

కరీంనగర్ సిటీ,(విజయక్రాంతి): విప్లవ వీరుడు, షహీద్ భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్‌లోని భగత్‌నగర్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ.. భగత్ సింగ్ కేవలం ఒక పేరు కాదని, దేశభక్తి, ధైర్యం, త్యాగానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. చిన్న వయసు నుంచే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: ఊరి చివర్లో ఎమ్మార్వో ఆఫీస్ వద్దు

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భగత్ సింగ్ సాగించిన పోరాటాన్ని ఆయన గుర్తుచేశారు. జైలు జీవితంలోనూ తన ఆలోచనలు, సిద్ధాంతాలతో సమాజంలో మార్పు కోసం కృషి చేశారని తెలిపారు. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ వంటి నినాదాలు స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ప్రజల్లో స్ఫూర్తిని నింపాయని అన్నారు.

దేశ స్వాతంత్య్రం కోసం భగత్ సింగ్ తన ప్రాణాలను త్యాగం చేశారని, ఆయనతో పాటు ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛను అనుభవిస్తున్నారని హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్, జిల్లా సీనియర్ నాయకులు మ్యాకల తిరుపతి, చంటి శ్రీనివాస్, గర్షకుర్తి విద్యాసాగర్, బండారి అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు