మరణంలోనూ మరో ఇద్దరికి చూపు
ముకరంపుర, నవంబర్ 11 (విజయ క్రాంతి): అవయవ దానాల్లో అత్యంత ప్రధానమైన నేత్రదానంపై (Eye Donation) లయన్స్ క్లబ్బులు విస్తృతంగా అవగాహన కల్పిస్తుండటంతో సామాన్య ప్రజల్లోనూ చైతన్యం పెరుగుతోందని శాతవాహన లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు.
కరీంనగర్ పట్టణంలోని విద్యానగర్ ప్రాంతానికి చెందిన ఈ. శైలజ దురదృష్టవశాత్తు పై అంతస్తు నుంచి కిందపడి మృతి చెందారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు శాతవాహన లయన్స్ క్లబ్ నాయకుడు లయన్ పచ్చునూరి సురేందర్ చొరవతో (Awareness Campaign) నేత్రదానానికి అంగీకరించారు.
దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలోని (Government Hospital) పోస్టుమార్టం విభాగంలో రేకుర్తి కంటి ఆసుపత్రి సిబ్బంది శైలజ పార్థివదేహం నుంచి నేత్రాలను సేకరించి హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి తరలించారు. సేకరించిన నేత్రాలతో మరో ఇద్దరు అర్హులకు చూపు ప్రసాదించే అవకాశం ఉందని శాతవాహన లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు లయన్ కెప్టెన్ డాక్టర్ బి. మధుసూదన్ రెడ్డి, అధ్యక్షుడు లయన్ ఎం. మహేందర్, పూర్వ కోశాధికారి లయన్ పి. సురేందర్ వెల్లడించారు.