సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలకు అన్ని ఏర్పాట్లు

16-10-2026 | 04:53pm

బతుకమ్మలు ఆడిన చోటే ఉంచండి..

చెరువులో నిమజ్జనం చేసే బాధ్యత మున్సిపాలీదే

చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)

 హుజురాబాద్,అక్టోబర్16: (విజయక్రాంతి) : జమ్మికుంట పట్టణంలో సద్దుల బతుకమ్మ, దసరా పండుగ వేడుకలను(Dasara festival celebrations) ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్(Municipal Chairman Molugu Prashanth Kumar) (దిలీప్) తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని పలు వార్డులు, ప్రధాన కూడళ్లలో మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

మహిళలు బతుకమ్మలు ఆడిన అనంతరం వాటిని చెరువు వద్దకు తీసుకెళ్లే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ఆడిన ప్రదేశంలోనే ఉంచితే మున్సిపల్ సిబ్బంది వాటిని సేకరించి నాయిని చెరువులో నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చెరువులో నీరు తక్కువగా ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సంప్రదాయాలను కాపాడుకుంటూ పర్యావరణానికి హాని కలగకుండా పండుగలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని, పట్టణ ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించి బతుకమ్మ, దసరా వేడుకలను విజయవంతం చేయాలని చైర్మన్ కోరారు.

మరిన్ని వార్తలు