ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ...
- ఇందిరమ్మ ఇండ్లతో పేదల జీవితాల్లో అభివృద్ధి వెలుగులు
- లబ్ధిదారులకు ఇండ్ల మంజూరి పత్రాలు అందజేసిన మంత్రి సీతక్క
ములుగు, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క(Minister for Women and Child Welfare, Danasari Seethakka) అన్నారు. బతుకమ్మ పండుగ వేళ రెండో విడత లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేస్తున్నామని, వచ్చే ఏడాది వారు తమ సొంతింట్లో బతుకమ్మ సంబరాలను వైభవంగా జరుపుకుంటారని పేర్కొన్నారు.
శుక్రవారం గోవిందరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మండల పరిధిలోని 13 గ్రామాలకు చెందిన 109 మంది లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున మొత్తం 5.45 కోట్ల నిధులతో నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సొంత నివాసం లేక ఇబ్బందులు పడుతున్న పేదలను గుర్తించి, వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ములుగు నియోజకవర్గంలో మొదటి విడతలో సుమారు ఐదు వేల ఇండ్లను మంజూరు చేశామని, రెండో విడతలోనూ అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రస్తుత విడతలో ఇండ్లు రాని అర్హులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తదుపరి విడతల్లో అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పేదలందరికీ సొంత నివాసం ఉండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి అన్నారు. పునాది స్థాయి నిర్మాణం పూర్తయిన తర్వాత బిల్లుల చెల్లింపులు ప్రారంభమవుతాయని తెలిపారు.
మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న లబ్ధిదారులకు ప్రారంభ నిర్మాణ ఖర్చుల కోసం సంఘాల ద్వారా రూ.లక్ష రుణం పొందే అవకాశం ఉందని వివరించారు. లబ్ధిదారుల వివరాలను ధ్రువీకరించి, నిబంధనల ప్రకారం ఇసుక అందించేలా జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులు, తహసీల్దార్ చర్యలు చేపట్టాలని కోరారు. సర్పంచులు లబ్ధిదారులకు అండగా నిలిచి, ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా దగ్గరుండి సహకరించాలని సూచించారు.
కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించామని, వాటికి సంబంధించిన క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తి చేసి తదుపరి చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. గృహాలకు ఉచిత విద్యుత్, రేషన్ బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలతో ప్రజా ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పనులను పెద్ద ఎత్తున కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.
పని పరిమాణాన్ని బట్టి రోజుకు సుమారు 310 వరకు కూలి పొందే అవకాశం ఉందన్నారు. పండుగ అనంతరం గ్రామాల్లో ఉపాధి పనులు విస్తృతంగా చేపట్టేలా సర్పంచులు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.