విద్యుత్ వైరు తెగిపడి పాడి గేదె మృతి
-ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లు
-బాధిత రైతును ఆదుకోవాలని స్థానికుల డిమాండ్
కారేపల్లి, అక్టోబర్ 16 విజయక్రాంతి: విద్యుత్ వైరు(Electric wire) తెగిపడి పంట పొలంలో(Crop field) మేత మేస్తున్న పాడి గేదె మృతి చెందిన ఘటన కారేపల్లి మండల(Karepalli Mandal) పరిధిలోని చీమలపాడు గ్రామంలో(Cheemalapadu Village) శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భాగం వెంకటేశ్వర్లు తన పాడి గేదెలను(Dairy buffalo) పంట పొలంలో మేపుతుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో విద్యుత్ వైరు తెగి కిందపడింది. దీంతో మేత మేస్తున్న గేదెలకు విద్యుత్ వైరు తగలడంతో ఒక పాడి గేదె అక్కడికక్కడే మృతి చెందింది.
సుమారు లక్ష రూపాయలు విలువచేసే గేదె మృతితో రైతుకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది.పాడి గేదెపై ఆధారపడి జీవనం సాగిస్తున్న బాధిత రైతును ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు ఆదుకోవాలని, మృతి చెందిన గేదెకు తగిన పరిహారం అందించి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యుత్ లైన్లను తనిఖీ చేసి, తెగిపోయే ప్రమాదం ఉన్న వైర్లకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.