నిమజ్జన ఘాట్లలో ముమ్మర ఏర్పాట్లు

16-10-2026 | 06:36pm

ముకరంపుర, అక్టోబర్ 16(విజయక్రాంతి) : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి(Telangana culture and tradition) ప్రతీక  సద్దుల బతుకమ్మ, దుర్గామాత నిమజ్జనాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Yadagiri Sunil Rao) తెలిపారు. బతుకమ్మ, శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మున్సిపల్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, పలువురు కార్పోరేటర్లు, అధికారులతో కలిసి సద్దుల బతుకమ్మ నిమజ్జనం ఘాట్లను సందర్శించారు.

మానేరు డ్యాం, మానేరు వాగు పరివాహక ప్రాంతాల్లోని, మార్కండేయ నగర్, శివనగర్, సప్తగిరికాలనీ, సీఎం పాయింట్, రాంచంద్రపూర్, లేక్ పోలీస్ స్టేషన్, గౌతమీనగర్, వేదభవన్, కొత్తపల్లి, గోపాల్‌పూర్, దుర్షేడ్ తదితర నిమజ్జనం ఘాట్లలో ఏర్పాట్లను తనిఖీ చేసి పరిశీలించారు. నగరపాలక సంస్థ ద్వారా రూ 3కోట్ల నిధులతో సద్దుల బతుకమ్మ, దుర్గామాత నిమజ్జనాలకు చేసే లైటింగ్ మరియు సౌండ్ సిస్టమ్, స్టోన్ డస్టుతో చదును, భారికేడింగ్, స్టేజ్ తదితర ముమ్మర ఏర్పాట్ల పనులను స్వయంగా పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు సూచనలతో ఆదేశాలు జారీచేశారు.

మరోవైపు ఈ నెల 21వ తేదీన జరిగే దుర్గామాత నిమజ్జనానికి మొట్ట మొదటి సారిగా నగరపాలక సంస్థ ద్వారా  ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మానకొండూర్, కొత్తపల్లి చెరువు లను ఎంపిక చేసి రెండు నిమజ్జనం పాయింట్లలో క్రేన్లు, లైటింగ్ సిస్టమ్, భారికేడింగ్, త్రాగునీరు, గజఈత గాళ్ళు, చక్కటి పారిశుధ్యం లాంటి ఏర్పాట్లు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు చొప్పరి జయశ్రీ-వేణు, మాసం గణేష్, ఎపిపి చంద్ర, తెల్ల లక్ష్మీ-రమేష్, ఆకుల నర్మద- నర్సయ్య, చాడగొండ కవిత -బుచ్చిరెడ్డి, సౌగని కొమురయ్య నాంపల్లి రేణుక-శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు