ఘరానా దొంగ అరెస్ట్

28-10-2026 | 09:56pm

కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న ఓ ఘరానా దొంగ(Thief )ను కరీంనగర్ రూరల్ పోలీసులు(Karimnagar Rural Police) అదుపులోకి తీసుకున్నారు.  కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి కథనం మేరకు  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ కు చెందిన బాలసాని అజయ్ ఇంటర్ చదువుతూ దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. గతంలో మానకొండూరు మండలం ఊటూరు బ్యాంకులో దోపిడీ చేసిన కేసుతో పాటు సుల్తానాబాద్ లో జరిగిన మూడు దొంగతనం కెసుల్లో అరెస్టు అయ్యాడు.

తర్వాత 2025లో హైదరాబాద్ వెళ్లిన అజయ్ షాపింగ్ మాల్ లో సేల్స్ మేన్ గా కొంతకాలం పని చేశాడు. అక్కడే సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న రాజుతో పరిచయం పెంచుకొని  బైక్ పై శ్రీశైలం వెళ్లి తిరుగు ప్రయాణంలో నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చోరీకి పాల్పడి  రెండున్నర తులాల బంగారం, కొంత నగదు ఎత్తుకెళ్లాడు. కరీంనగర్ కు వచ్చిన అజయ్  విజయ్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో  పావుతులం బంగారం, 25తులాల వెండి అపహరించాడు. 

వేలిముద్రలు పోలీసులకు దొరకకుండా  అజయ్ అదే ఇంట్లో ఉన్న కారం పొడి చల్లి క్లూస్ టీమ్ కు చిక్కకుండా తప్పించుకునేందుకు ప్లాన్ వేశాడు. గత ఆగస్టు నెలలో జరిగిన ఈ దొంగతనం గురించి కరీంనగర్ రూరల్ పోలీసులు నిందితున్ని బుధవారం మధ్యాహ్నం బొమ్మకల్ కోకోకోలా దాభా వద్ద అరెస్ట్ చేశారు.  అజయ్ కి సంబంధించిన ఆనవాళ్లను నాట్ గ్రిడ్ యాప్ ద్వారా సేకరించిన పోలీసులు అతనే నిందితుడని టెక్నికల్ గా నిర్దారించారు. అజయ్ ని అరెస్టు చేసి కరీంనగర్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు కరీంనగర్ రూరల్ సీఐ  నిరంజన్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు