పోలీసు అమరవీరుల యాదిలో
కరీంనగర్ క్రైమ్, అక్టోబర్ 22(విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్బంగా కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలో పోలీసు అమరవీరుల స్థూపం వద్ద బుధవారం ఫ్లాగ్ డే కార్యక్రమం నిర్వహించారు. సిపి గౌస్ ఆలం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా హాజరయ్యారు. అమరవీరుల విగ్రహానికి కరీంనగర్ సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం దేశవ్యాప్తంగా అమరులైన పోలీసులను స్మరించుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమీషనర్ తో పాటు ఇతర పోలీసు అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి హాజరైనవారంతా పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించారు.
అనంతరం కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్బంగా దేశ రక్షణకోసం, సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసులను ఫ్లాగ్ డే సందర్బంగా స్మరించుకుని నివాళులు అర్పించామన్నారు. ఈ ఏడాది విధి నిర్వహణలో భాగంగా దేశవ్యాప్తంగా అమరులైన పారా మిలిటరీ, రాష్ట్ర పోలీసులకు శోక శస్త్ర ద్వారా ఘన నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలు ఎప్పటికీ వృధా కావన్నారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు ప్రశాంతంగా ఉండేలా, శాంతి భద్రతలు కాపాడే విధంగా విధులు నిర్వహిస్తామన్నారు. అనంతరం అమరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిసిపిలు వెంకటరమణ తో పాటు కమిషనరేట్ లోని పోలీస్ అధికారులు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.