భక్తుల కొంగు బంగారం మహాశక్తి

08-10-2026 | 05:30am
  1. కోరికలు తీర్చే తల్లి.. కొండంత అండ
  2. గుప్పెడు మందితో మొదలై.. లక్షలాది భక్తుల ఇలవేల్పు
  3. విరాజిల్లుతున్న కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయం
  4. ఈ నెల 11 నుండి 20 వరకు ప్రత్యేక కార్యక్రమాలు

ముకరంపుర, అక్టోబర్ 7(విజయక్రాంతి): కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయం(Karimnagar Sri Mahashakti Temple)..సరిగ్గా 16 ఏళ్ల క్రితం అంటే 2010 జూన్ 17న జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య(Jagadguru Shankaracharya Hampi Virupaksha Vidyaranya) చేతుల మీదుగా ప్రతిష్టించిన మహా పుణ్యక్షేత్రం. గుప్పెడు మందితో మొదలైన అమ్మవారి దర్శనం నేడు లక్షలాది మంది భక్తుల విశ్వాస క్షేత్రంగా విరాజిల్లుతోంది.16 ఏళ్ల క్రితం బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) సంకల్ప బలంతో కొలువైన ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతూ జిల్లా ఎల్లలు దాటి ఇతర రాష్ట్రాలకు, దేశ సరిహద్దులను దాటి వివిధ భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైంది.

కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా& కొండంత అండగా&దీక్ష తీసుకున్న వారికి ధైర్యంగా& భక్తులకు ఆత్మీయ తల్లిగా&మహాశక్తి అమ్మవారిని భక్తులు కొలుస్తున్నారు. ఈ పుణ్య క్షేత్రం ఏడాది పొడువునా ప్రత్యేక పూజలందుకుంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అలరారుతూనే ఉంది. ఇక దసరా నవరాత్రులు ఇక్కడ హైలైట్ గా నిలుస్తాయి. విజయవాడ దుర్గమ్మ ఆలయ ఉత్సవాలను తలపించేలా దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. 

బండి పర్యవేక్షణలో దసరా ఉత్సవాల ఏర్పాట్లు షురూ..

ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుడికి కేవలం దర్శనం మాత్రమే కాదు&భక్తి అనుభూతి& సేవా స్పర్శ& సంప్రదాయ వైభవం& కుటుంబ ఆత్మీయతను అందించే ఆధ్యాత్మిక క్షేత్రంగా మహాశక్తి దేవాలయం తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. మరో మూడు రోజుల్లో ఈ మహిమాన్విత క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు ఆరంభం కాబోతోండటంతో భక్తులందరి ద్రుష్టి ఈ క్షేత్రంపైనే ఉంటుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఆలయ నిర్వాహకులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యవేక్షణలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 

భవానీ దీక్షాపరులతో కిటకిటలాడనున్న మహాక్షేత్రం

శ్రీమహాశక్తి ఆలయం ప్రతిష్టించిన తొలిరోజుల్లో బండి సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు గుప్పెడు మంది మాత్రమే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భవానీ మాలాధారణ గావించి దీక్ష తీసుకునే వారు. ఈ 16 ఏళ్లలో ఊహించని రీతిలో భవానీ దీక్షా పరుల సంఖ్య పెరిగి వేలాది మంది భవానీ దీక్ష తీసుకుని అమ్మవారి సేవలో తరిస్తున్నారు. దుర్గామాత దీక్షాపరులతో ఈ పుణ్యక్షేత్రం దసరా నవరాత్రి ఉత్సవాల్లో సందడిగా మారబోతోంది. 108 రోజుల దీక్ష& మండల దీక్ష& నవరాత్రి దీక్ష& ఎన్ని రోజులు దీక్ష చేసినా లక్ష్యం ఒక్కటే& అమ్మవారి ఆశీస్సులు పొందాలి& అమ్మను నమ్ముకుని ముందుకు సాగాలి. అన్నదే భక్తుల సంకల్పంగా మారింది.

అమ్మ దర్శనమే కాదు.. అన్న ప్రసాదం హైలైట్

అన్నదానం& ఇక్కడ ఒక సేవ కాదు, ఒక సంప్రదాయం. మహాశక్తి సన్నిధిలో అన్నదానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ శ్రీ మహాశక్తి ఆలయానికి వచ్చే భక్తులందరికీ ప్రతినెల సంకట హర చతుర్థి రోజున  రుచికరమైన అన్న ప్రసాదాలు వడ్డిస్తున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే వేలాది మందికి భోజనం వడ్డిస్తారు.భక్తుడు అమ్మవారిని దర్శించుకుని బయటకు వెళ్లేటప్పుడు అమ్మను చూశాం అనే అనుభూతితో పాటు అమ్మ ప్రసాదం తిన్నాం అనే తృప్తితో వెళ్లేలా అన్నదానాన్ని నిర్వహిస్తుండటం ఇక్కడి విశేషం.

ఏడాది పొడువునా అధ్యాత్మిక కార్యక్రమాలతో అలరారుతున్న పుణ్యక్షేత్రం

మహాశక్తి దేవాలయంలో నవరాత్రులు మాత్రమే కాదు& ఏడాది పొడవునా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఏటా వచ్చే హిందూ పండగులు, పవిత్ర మాసాల సమయంలోనూ ఆలయాన్ని అందంగా ముస్తాబు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుండటం ఆనవాయితీగా మారింది. ఉగాది పంచాంగ వేడుకలు, భద్రాద్రి తరహాలో శ్రీరామనవమి ఉత్సవాలు, శ్రావణ మాస వేడుకలు, వరలక్ష్మీ వ్రతం సహా శ్రావణ మాసంలో మహిళా భక్తులతో ఆలయం సందడిగా మారడం విశేషం వసంత పంచమి సందర్భంగా బాసరను తలపించేలా సామూహిక అక్షరాభ్యాసం కొనసాగుతోంది.

మహాశివరాత్రి రుద్రాభిషేకం&సంకటహర చతుర్థి గణేశ్ హోమం& ఆషాఢంలో శాకాంబరి ఉత్సవాలు&నాగుల చవితి సందర్భంగా నాగేంద్రస్వామికి అభిషేకం& గణేశ్ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు&కృష్ణాష్టమి వేడుకలు&దీపావళి వేడుకలు& కార్తీక మాసంలో అయ్యప్పస్వామి పడిపూజ&సంక్రాంతిలో గోదా కళ్యాణం&ద్వాదశి సందర్భంగా తులసీ కళ్యాణం....ఇలా భక్తుడికి ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతోంది. 

ఆధ్యాత్మిక వేడుక దాండియా మరో హైలైట్

శ్రీ మహాశక్తి ఆలయంలో ఆధ్యాత్మిక వేడుక దాండియా మరో హైలైట్ గా మారనుంది. వినోదంగా కాకుండా పూర్తి భక్తి పారవశ్యంలో నిర్వహించే వేడుకగా దాండియా నిర్వహిస్తున్నారు. కొద్ది మందితో మొదలైన దాండియా& నేడు వేలాది మంది పాల్గొనే భక్తి పారవశ్య కార్యక్రమంగా ఎదిగింది.

10 రోజులు 10  ఆధ్యాత్మిక అనుభూతులు

ఈనెల 11 నుండి 20 వరకు అంటే పదిరోజుల పాటు మహాశక్తి ఆలయంలో నిర్వహించే నవరాత్రి ఉత్సవాలు రోజుకో ప్రత్యేకతను సంతరించుకోనుంది. బాలాత్రిపురసుందరి నుంచి గాయత్రీదేవి వరకు& అన్నపూర్ణ నుంచి మహిషాసురమర్దిని వరకు& లలితాదేవి నుంచి మహాలక్ష్మి వరకు& దుర్గాదేవి నుంచి రాజరాజేశ్వరి వరకు& అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 108 రకాల నైవేద్యం& చండీ పారాయణం&లక్ష్మీ పూజ&సహస్రనామ పారాయణం&చండీ హోమం&భజనలు& సాంస్కృతిక కార్యక్రమాలు&అన్నదానం& ఇవన్నీ కలసి కరీంనగర్లో నవరాత్రి వైభవానికి కొత్త శోభను తీసుకురానున్నాయి.

భక్తులారా.. తరలిరండి

అక్టోబర్ 11 నుంచి 20 వరకు కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయం నిర్వహించే నవరాత్రి ఉత్సవాలకు భక్తులందరూ భారీ ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఉత్సవాల్లో పాలు పంచుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపినిచ్చారు. “ఇది కేవలం నవరాత్రి ఉత్సవాలు కాదు. అమ్మను ఆరాధించే పది రోజుల పర్వదినం. భక్తిని అనుభవించే పది రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం. మహాశక్తి తల్లిని అక్కున చేర్చుకునే పది రోజుల మహోత్సవం.  అమ్మ దగ్గరకు రండి& అమ్మ ఆశీస్సులు తీసుకెళ్లండి. అని కోరారు.

మరిన్ని వార్తలు