చంద్రకళ ఆత్మహత్యపై న్యాయ విచారణ జరిపించాలి
రాష్ట్ర పౌర హక్కుల సంఘం డిమాండ్
ముకరంపుర, నవంబర్ 2 (విజయ క్రాంతి): శాతవాహన యూనివర్సిటీ(Satavahana University) న్యాయశాస్త్ర విద్యార్థి డాకూరు చంద్రకళ ( 23) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ గ్రామానికి చెందిన డక్కలి సామాజిక వర్గ చిన్నయ్య లక్ష్మమ్మల కూతురు చంద్రకళ కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ నందు ఎల్ ఎల్ బి రెండవ సంవత్సరం చదువుతుంది.
ఆదివారం మధ్యాహ్నం హాస్టల్ రూమ్ లో మధ్యాహ్నం 2-30 గంటలకు చున్నీ తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో తోటి విద్యార్థులు,హాస్టల్ సిబ్బంది యూనివర్సిటీ అధికారులకు పోలీసులకు సమాచారం అందించారు. షాద్నగర్ నుంచి వచ్చిన చంద్రకళ తల్లిదండ్రుల కథనం మేరకు చదువుల్లో చురుగ్గా ఉండేదని పోటీ పరీక్షలు రాస్తూ, ఎస్సై పరీక్ష కోసం సన్నద్ధం అవుతున్నట్లుగా తెలిపారు.
ఆదివారం మధ్యాహ్నం బిటెక్ చదువుతున్న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చెందిన గజ్జల హరికృష్ణ తో సెల్ఫోన్ మాట్లాడుకుంటూ ఉరి వేసుకున్నట్లుగా తెలుస్తుంది. సెలవుల్లో, కరోనా కాలంలో తన చుట్టుపక్కల పిల్లలకు చదువులు, మార్షల్ ఆర్ట్స్ నేర్పించేదని, చైతన్య మహిళా సంఘం లో సామాజిక బాధ్యతలు నెరవేర్చేదని,ధైర్యంగా మాట్లాడేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటన పై రాష్ట్ర పౌరహక్కుల సంఘం నాయకులు కుమారస్వామి, బొంకూరి లక్ష్మణ్ లు మాట్లాడుతూ చంద్రకళ ఆత్మహత్యకు కారకుడైన హరికృష్ణ పై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయవిచారణ జరిపించి శిక్షించాలన్నారు. గత కొద్ది కాలంగా రాష్ట్రంలో గంజాయి ఇతర మత్తు వ్యసనాలకు అలవాటు పడుతున్న యువత వేధింపుల వల్ల విద్యార్థులు యువతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, గతంలో కూడా ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరిగాయని అందులో భాగంగానే ఈ ఆత్మహత్య ఘటన జరిగినట్లుగా పేర్కొన్నారు.
కాబట్టి కాలేజీలో, యూనివర్సిటీలో కౌన్సిలింగ్ సెంటర్లు ,భరోసా క్యాంపులు ఏర్పాటు చేయడంతో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడవచ్చు అన్నారు. చంద్రకళ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా, అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇవ్వాలని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ , రిజిస్ట్రార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రకళ మృతిపై శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్పందిస్తూ 4 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించి, తక్షణమే 1.5 లక్షలు కుటుంబానికి అందజేశారు. మిగతా మొత్తం వారం రోజుల్లో అందిస్తామని, అలాగే కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు.
ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు కాంపల్లి అరవింద్ మాట్లాడుతూ చంద్రకళ ఆత్మహత్య అనుమానాస్పదంగా ఉందని, యూనివర్సిటీ హాస్టల్ కేర్ టేకర్ మరియు వార్డెన్ విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించడమే కారణమని కావున వారిని విదుల్లోంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు, సహచర విద్యార్థులు పాల్గొన్నారు.