మచ్చ ప్రభాకర్ రావు సేవలు మరువలేనివి
కరీంనగర్ సిటీ అక్టోబర్16 (విజయక్రాంతి ): తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం(Telangana Region Padmasali Association) పూర్వ రాష్ట్ర అధ్యక్షులు, పద్మశాలి జాతి ముద్దుబిడ్డ స్వర్గీయ మచ్చ ప్రభాకర్ రావు(Maccha Prabhakar Rao) జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరుగుతోందని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ వాసాల రమేష్(Vasala Ramesh), రాష్ట్ర పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు మెతుకు సత్యం అన్నారు. స్వర్గీయ మచ్చ ప్రభాకర్ రావు జయంతి పురస్కరించుకొని కరీంనగర్ లోని ఆదర్శ చేనేత సహకార సంఘం -2 పద్మా నగర్ లో జయంతి వేడుకలు చేనేత కార్మికులతో(Handloom workers) కలిసి శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
వారి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ మచ్చ ప్రభాకర్ రావు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేసి పద్మశాలి ఐక్యతను చాటి చెప్పిన మహనీయుడని కొనియాడారు. రిటైర్డ్ ఆర్డీవో గా ఉద్యోగ విరమణ అనంతరం ప్రజాసేవే ధ్యేయంగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
హైదరాబాద్ లో వేలాది మందితో "పద్మశాలి శంఖారావం" పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించి అన్ని రాజకీయ పార్టీలను ఓకే వేదికగా ఏర్పాటు చేసి ప్రకంపనలు సృష్టించారని పేర్కొన్నారు.యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించుటకు, చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారు.
చేనేత నిరుపేద కుటుంబాలను ఆదుకొని ఆర్థిక చేయూత, రుణ సౌకర్యాలు కల్పించారు.పేద విద్యార్థులకు చదువు పట్ల అవగాహన కల్పించి, విద్యా స్కాలర్ షిప్ లు, ఉచిత శిక్షణా తరగతులు ఏర్పాటు చేయించారు. యువత విద్యపైనే దృష్టి సారించి ముందుకు వెళ్లాలని సూచించేవారు. పేదల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం, వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు వంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
"సమాజ సేవే నిజమైన జీవితం, ప్రజల కోసం పనిచేయడం మహోన్నతం" అనే నినాదంతో జీవించిన మచ్చ ప్రభాకర్ రావు అనతి కాలంలోనే మనందరికీ దూరం కావడం పద్మశాలి సమాజానికి తీరని లోటని, అయినప్పటికీ ఆయన ఆశయ సాధన కోసం, ఆయన చూపిన మార్గంలో ముందుకు వెళ్తామని నాయకులు పేర్కొన్నారు.
ఈ జయంతి వేడుకల్లో పద్మశాలి సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి వోల్లాల కృష్ణహరి, జిల్లా ఉపాధ్యక్షులు వేముల విష్ణుమూర్తి, జిల్లా ప్రచార కార్యదర్శి మార్త ప్రకాష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వోడ్నాల రవీందర్,జిల్లా నాయకులు యెన్నం మునీందర్, దూస కైలాసపతి, దీకొండ లక్ష్మీనారాయణ, మెతుకు వంశీకృష్ణ, చేనేత ఆదర్శ సహకార సంఘం-2 అధ్యక్షుడు కటకం సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు నల్ల పర్శరాములు, కార్యదర్శి ఎం. సత్యనారాయణ, సంఘ నాయకులు ఆరుకాల నాగేందర్, సిరిపురం సుదర్శన్, గోరంట్ల సాయి కృష్ణ, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
అనంతరం ఆదర్శ చేనేత సహకార సంఘం వద్ద చేనేత కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.