మారుతి నగర్ అభివృద్ధికి రూ.50 లక్షలు

06-11-2026 | 05:36pm

8వ వార్డులో అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

హుజురాబాద్ (విజయక్రాంతి): జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు మారుతి నగర్‌లో అభివృద్ధి పనులకు అడుగులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం జమ్మికుంట మున్సిపాలిటీకి కేటాయించిన రూ.15 కోట్ల నిధుల నుంచి రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్(Municipal Chairman Molugu Prashanth Kumar Dileep) స్థానిక కౌన్సిలర్ కొలుగురి సురేష్‌తో కలిసి భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. 8వ వార్డులో స్థానిక కౌన్సిలర్ కొలుగురి సురేష్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో పాటు వార్డులో అవసరమైన ఇతర అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను కౌన్సిలర్ ద్వారా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ప్రస్తుత పాలకవర్గం ఉన్నంతకాలం 8వ వార్డు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటామని, స్థానిక కౌన్సిలర్ ఆధ్వర్యంలో వార్డును మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. జమ్మికుంట పట్టణంలోని అన్ని వార్డుల్లోనూ దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కొలుగురి సురేష్, మున్సిపల్ మేనేజర్ గుర్రాల రాజిరెడ్డి, ఏఈ వికాస్, వడ్లకొండ రమేశ్, శ్రీకాంత్, రఫీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు