కరెంట్ కోతలతో రైతులకు అవస్థలు

16-10-2026 | 04:54pm

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్ (విజయక్రాంతి):రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతలతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి(MLA Kova Lakshmi) విమర్శించారు. పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో మోటార్లు కాలిపోతున్నాయని, ట్రాన్స్‌ఫార్మర్లు పేలుతున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణకు కీలకమైన సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు సరికాదని అన్నారు.

విద్యుత్ కోతలతో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులను బాధ్యులను చేయడం తగదని పేర్కొంటూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, కాలిపోయిన మోటార్లకు, పంట నష్టాలకు పరిహారం అందించాలని, సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని, విద్యుత్ కోతలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోవా లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, కౌన్సిలర్లు చిలువేరి వెంకన్న, నాగుబాయి, దూడల లక్ష్మి, బీఆర్ఎస్ నాయకురాలు మారుసుకోల సరస్వతి, పార్టీ అధ్యక్షుడు జాబోర్ రవీందర్, నాయకులు సాయి శ్రావణ్, శ్రీనివాస్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు